
న్యూఢిల్లీ: దేశంలో ఇన్‌ఫ్లేషన్ దిగొస్తోంది. హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే డబ్ల్యూపీఐ ఇండెక్స్ ఏప్రిల్‌లో నెగెటివ్ గ్రోత్‌ను నమోదు చేసింది. గత మూడేళ్లలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ నెగెటివ్‌లో నమోదుకావడం ఇదే మొదటిసారి. డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ ఏప్రిల్‌లో (మైనస్) 0.92 శాతంగా నమోదయ్యింది. గత 11 నెలలుగా హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుతున్న విషయం తెలిసిందే. 2020, జూన్‌లో డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ (మైనస్) 1.81 శాతానికి పడింది. నెగెటివ్ ఇన్‌ఫ్లేషన్ అంటే రేట్లు ఏడాది ప్రాతిపదికన తగ్గుతూ వస్తున్నాయని అర్థం.
కిందటేడాది ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ 15.38 శాతంగా రికార్డయ్యింది. బేస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ భారీగా తగ్గినట్టు కనిపిస్తోంది. ‘బేసిక్ మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, మినరల్ ఆయిల్స్, టెక్స్‌టైల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, రబ్బర్ , ప్లాస్టిక్, పేపర్ ప్రొడక్ట్‌ల ధరలు తగ్గడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో హోల్‌సేల్ ధరలు 34 నెలల దిగువకు పడ్డాయి’ అని కామర్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ 1.34 శాతంగా రికార్డయ్యింది. మరోవైపు రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే సీపీఐ ఏప్రిల్‌లో 18 నెలల కనిష్టమైన 4.70 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే .
పడిన ఆయిల్ దిగుమతులు
దేశ వాణిజ్య లోటు ఏప్రిల్‌లో తగ్గింది. ఆయిల్ దిగుమతులు తగ్గడంతో ట్రేడ్ డెఫిసిట్ (వాణిజ్య లోటు) 21 నెలల దిగువకు వచ్చింది. మర్చండైజ్, సర్వీస్‌లకు సంబంధించి ట్రేడ్ డెఫిసిట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.38 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 8.37 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న గూడ్స్, సర్వీస్‌ల విలువ ఈ ఏడాది ఏప్రిల్‌లో 65.02 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 66.40 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. దేశ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరగగా, దిగుమతులు 8 శాతం మేర తగ్గాయి.
ఒక్క గూడ్స్ ఎగుమతులు తీసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏడాది ప్రాతిపదికన 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ఇంపోర్ట్స్ కూడా 14 శాతం పడిపోయి 49.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గూడ్స్‌కు సంబంధించి ట్రేడ్ డెఫిసిట్ 15.24 బిలియన్ డాలర్లుగా ఉంది. సర్వీస్ సెక్టార్ల ఎగుమతులు మాత్రం బాగున్నాయి. సర్వీస్ ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్‌లో 30.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంపోర్ట్స్ 16.50 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం, దేశ గూడ్స్ , సర్వీస్ ఎగుమతుల విలువ 2022–23 లో 775.87 బిలియన్ డాలర్లుగా ఉంది.