చంద్రయాన్ ‑3 జర్నీ షురూ.. 40 రోజుల తర్వాత ల్యాండింగ్

చంద్రయాన్ ‑3 జర్నీ షురూ.. 40 రోజుల తర్వాత ల్యాండింగ్

శ్రీహరికోట (ఏపీ):  చందమామను అందుకునేందుకు ముచ్చటగా మూడో సారి మన జర్నీ సక్సెస్ ఫుల్ గా ప్రారంభమైంది. కోట్లాది మంది ఇండియన్ల ఆశలను మోసుకుంటూ ఇస్రో బాహుబలి రాకెట్ ‘ఎల్వీఎం3-–ఎం4’ నారింజ రంగు మంటలు చిమ్ముతూ, తెల్లటి పొగలను కక్కుతూ నింగికి దూసుకెళ్లింది. పక్కాగా ప్లాన్ ప్రకారం.. చంద్రయాన్-–3 స్పేస్ క్రాఫ్ట్ ను కచ్చితమైన కక్ష్యలోకి వదిలిపెట్టి.. మూడో చంద్రయాత్రకు అద్భుతంగా శ్రీకారం చుట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్వీఎం3–--ఎం4 రాకెట్​ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. –

ప్రయోగం తర్వాత ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ సరిగ్గా16 నిమిషాలకు చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్​ను రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. ఇకపై స్పేస్ క్రాఫ్ట్ తనంతట తానుగా భూమిని ఐదారు సార్లు చుట్టి వస్తుంది. ఆ తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభిస్తుందని ఇస్రో చీఫ్​ ఎస్. సోమనాథ్ ప్రకటించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో మాజీ చైర్మన్ కె. శివన్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రయాన్-–3 ప్రయోగాన్ని చూసేందుకు శ్రీహరికోట వద్దకు ఉదయం నుంచే వేలాది మంది జనం తరలివచ్చారు. రాకెట్ నింగికి ఎగరగానే పెద్ద ఎత్తున ఆనందంతో కేకలు వేశారు. మిషన్ కంట్రోల్ సెంటర్ లోనూ రాకెట్ ప్రయోగం సక్సెస్ కాగానే సైంటిస్టులు ఆనందంతో చప్పట్లు కొడుతూ, ఆలింగనం చేసుకుంటూ ఒకరినొకరు అభినందించుకున్నారు.

ఆగస్టు 23న ల్యాండింగ్..

ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్–3ని అనుకున్న ప్రకారమే కచ్చితమైన ఆర్బిట్ లోకి చేర్చామని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘చంద్రయాన్–3 జర్నీ షురువైంది. ఆగస్టు 1న దానిని చంద్రుడి కక్ష్యలోకి చేరుస్తాం. చివరగా ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ ను దింపుతాం” అని ఆయన ప్రకటించారు. ఈ ప్రయోగంతో ఎల్వీఎం3 రాకెట్ మరోసారి సత్తా చాటిందని మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తువేల్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎం3 రాకెట్ కు ఇది ఆరో ప్రయోగమని, వరుసగా ఆరో ప్రయోగంలోనూ ఇది సత్తా చాటిందన్నారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కన్న కలలకు ఈ రోజు బీజం పడిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  అన్నారు.  ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో సైంటిస్టులను ఆయన అభినందించారు. 

జులైలోనే ఎందుకంటే..

గతంలో చంద్రయాన్-–2 ప్రయోగం కూడా ఇదే నెలలో (జులై 22, 2019) జరిగింది. సెప్టెంబర్ 2న ల్యాండింగ్ నిర్వహించగా టెక్నికల్ సమస్యల కారణంగా అది ఫెయిల్ అయింది. ఇప్పుడు చంద్రయాన్-–3 ప్రయోగాన్ని కూడా జులైలోనే చేపట్టారు. అయితే, ఏటా జులై నెలలోనే చంద్రుడు, భూమికి మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఇదే నెలలో అయితేనే తక్కువ టైం, తక్కువ వ్యయంతో చంద్రుడి కక్ష్యను చేరడం సాధ్యం అవుతుంది. అందుకే ఇస్రో చంద్రయాన్–3 మిషన్ ను కూడా ఇదే నెలలో చేపట్టింది. అయితే, చంద్రయాన్–1 మిషన్ ను మాత్రం 2008 అక్టోబర్ 22న ప్రారంభించారు. నవంబర్ 8న ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ఎంటరైంది.  

మిషన్ లైఫ్ 14 రోజులే.. 

చంద్రయాన్–3 మిషన్ లో పంపుతున్న ల్యాండర్, రోవర్​ల మిషన్ లైఫ్ కేవలం ఒక లూనార్ డే మాత్రమే. అంటే.. మన భూమిపై రోజుల ప్రకారం లెక్కిస్తే 14 రోజులే. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేపట్టడం, రోవర్ ను నడిపించి ఎక్స్ పరిమెంట్లు చేయించడంలో ఇండియా టెక్నాలజీని టెస్ట్ చేసుకోవడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. చంద్రయాన్–2లో పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ బాగానే పని చేస్తోంది. ఈ మిషన్ లో దానిని కూడా వాడుకోనున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయితే.. అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా దింపిన నాలుగో దేశంగా ఇండియా చరిత్ర సృష్టించనుంది.  

హైదరాబాద్ కంపెనీల పాత్ర..

చంద్రయాన్–3 మిషన్​లో హైదరాబాద్​కు చెందిన పలు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఎల్వీఎం3 రాకెట్ కు, చంద్రయాన్‑3 ల్యాండర్, రోవర్​లకు కావాల్సిన ముఖ్యమైన పలు విడి భాగాలను సిటీకి చెందిన కంపెనీలే తయారు చేశాయి. రక్షణ శాఖకు చెందిన మిధాని సంస్థతో పాటు శ్రీవెంకటేశ్వర ఏరోస్పేస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, అనంత టెక్నాలజీస్,  నాగసాయి ప్రెషిషన్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్​కు కావాల్సిన కీలకమైన లోహాలను మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ తయారు చేసింది.కీలకమైన సెన్సర్ల తయారీలో పాలు పంచుకుంది.

40 రోజుల  ప్రయాణం ఇలా..

చంద్రయాన్–3 స్పేస్ క్రాఫ్ట్ లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రొపల్షన్ మాడ్యూల్ మోసుకెళ్తోంది. ఇస్రో ‘ఫ్యాట్ బాయ్’ ఎల్వీఎం3 రాకెట్ నుంచి భూ కక్ష్యలోకి విడిపోయినప్పటి నుంచీ.. ల్యాండర్, రోవర్ లను చంద్రుడికి100 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి తీసుకెళ్లి ల్యాండింగ్ చేసేవరకూ 40 రోజుల జర్నీ అంతా ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారానే జరుగుతుంది. ఈ జర్నీలో భాగంగా ప్రొపల్షన్ మాడ్యూల్ కొన్నాళ్లు  భూమి చుట్టూనే దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. కనిష్టంగా170 కిలోమీటర్లు, గరిష్టంగా 36,500 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఐదారు సార్లు భూమిని చుట్టి వస్తుంది. 

ఈ సమయంలో దశలవారీగా దీని కక్ష్యను పెంచుతూ పోతారు. కావాల్సినంత ఎత్తుకు చేరిన తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభించి, ఆగస్టు 1న మూన్​ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూ దశల వారీగా కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడికి 100 కిలోమీటర్ల దగ్గరగా వెళ్తుంది. చివరగా ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు లేదా ఆగస్టు 24వ తేదీన ల్యాండర్ ను చంద్రుడిపైకి జారవిడుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ గా దిగుతుంది. ఆ వెంటనే ల్యాండర్ పై నుంచి రోవర్ కిందకు దిగి ముందుకు వెళ్తుంది.  

మరో మైలురాయి: ముర్ము

చంద్రయాన్‑3 మిషన్ ప్రారంభం అంతరిక్ష రంగంలో దేశానికి మరో మైలు రాయి. స్పేస్ సైన్స్, టెక్నాలజీలో ఈ మిష న్​తో దేశం మరో ముందడుగు వేస్తుంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో సైంటిస్టులను అభినందిస్తూ ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఇస్రో చేపట్టిన మూన్ మిషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రోకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

సైంటిస్టులకు సెల్యూట్: మోదీ

చంద్రయాన్‑3 మిషన్ ను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా అంతరిక్ష రంగంలో ఇండియా మరో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి భారతీయుడి కలలను, ఆశయాలను ఈ మిషన్ మరింత ఎత్తుకు తీసుకెళ్లిందన్నారు. ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా చేపట్టిన ఇస్రో సైంటిస్టులను అభినందిస్తూ ఆయన ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ఈ అద్భుతమైన విజయం మన సైంటిస్టుల నిరంతర శ్రమ, అంకితభావానికి నిదర్శనం. వారందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా” అని పేర్కొన్నారు.

మూన్ ల్యాండింగ్  సక్సెస్ అయితది: శివన్ 

నాలుగేండ్ల క్రితం చంద్రయాన్–2 ప్రయోగంలో ఎదుర్కొన్న లోపాలను సరి చేసుకుని చంద్రయాన్–3 మిషన్​లో ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుందని ఆ సంస్థ మాజీ చైర్మన్ కె.శివన్ చెప్పారు. ఈ సారి మూన్ ల్యాండింగ్ తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్​లో రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందని, మలి దశలో మూన్ ల్యాండింగ్ అంత ఈజీ కాకపోయినా.. దానిని సక్సెస్ చేసేందుకు సైంటిస్టులు అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యారని మాజీ చైర్మన్ కె.శివన్ తెలిపారు.

స్పేస్ రిసెర్చ్ రంగంలో పెద్ద మైలురాయి

శ్రీహరికోటలోని సతీశ్​ధవన్​ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 మొదటి దశ విజయవంతం కావడంతో ఇండియన్ స్పేస్ రిసెర్చ్ సెక్టార్ ఒక పెద్ద మైలురాయిని అధిగమించింది. ఎల్వీఎం3 - ఎం4 చంద్రయాన్​-3ని ఇస్రో సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం అభినందనీయం. ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన ఇస్రో చైర్మన్‌‌‌‌కు, సైంటిస్టులకు, ఇతర టెక్నికల్ సిబ్బందికి కంగ్రాట్స్ . ‑ తెలంగాణ సీఎం కేసీఆర్​ 

ఇస్రో సైంటిస్టులకు అభినందనలు

దేశ శాస్త్రవేత్తల కృషి, పట్టుదల, అంకిత భావానికి చంద్రయాన్‌‌ 3 సక్సెస్సే నిదర్శనం. ఈ విజయంతో దేశ కీర్తి ప్రపంచంలో మరోసారి వెలిగిపోయింది. చంద్రయాన్‌‌ 3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్ర్తవేత్తలకు నా శుభాకాంక్షలు. ఇస్రో ఇలాంటి విజయాలు మరిన్నో సాధించాలని కోరుకుంటున్న. ‑ పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి