
న్యూఢిల్లీ: దేశంలో యాక్టివిటీ జోరందుకోవడంతో మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ మే నెలలో 31 నెలల గరిష్టానికి చేరింది. తయారీ రంగానికి కొత్త ఆర్డర్లు పెరగడం, మార్కెట్ కండిషన్లు అనుకూలంగా ఉండటంతోపాటు, కొత్త ఉపాధి అవకాశాలూ కలిగాయని నెలవారీ పీఎంఐ రిపోర్టు తెలిపింది. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లోని 57.2 నుంచి మే నెలలో 58.7 కి పెరిగింది. అక్టోబర్ 2020 నుంచి చూస్తే ఈ రంగం ఇంత ఇంప్రూవ్మెంట్ ఎప్పుడూ చూపించలేదని పీఎంఐ సర్వే రిపోర్టు పేర్కొంది.
వరసగా 23 వ నెలలోనూ ఆపరేటింగ్ కండిషన్లు బాగా మెరుగయినట్లు మే పీఎంఐ డేటా వెల్లడిస్తోంది. పీఎంఐ 50 కి మించితే ఆ సెక్టార్ విస్తరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ 50 కి దిగువన నమోదైతే కుచించుకుంటున్నట్లు తెలుసుకోవాలి. దేశంలోనూ, దేశం బయటా ఇండియాలో తయారవుతున్న వస్తువులకు గిరాకీ ఎక్కువగా ఉందనడానికి పెరుగుతున్న సేల్స్ నిదర్శనంగా నిలుస్తాయని పీఎంఐ సర్వే రిపోర్టు పేర్కొంది. డొమెస్టిక్ ఆర్డర్ల పెరుగుదల వల్ల ఎకానమీ ఫౌండేషన్ పటిష్టమవుతుందని వివరించింది.