ఉగ్రవాద నిర్మూలనే టార్గెట్: అజిత్ దోవల్

ఉగ్రవాద నిర్మూలనే టార్గెట్: అజిత్ దోవల్

న్యూఢిల్లీ : తీవ్రవాదులకు ఫండింగ్ చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ దేశంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత్, మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్న ఈ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పలు సూచనలు చేశారు. 

ఉగ్రవాద నిర్మూలనే తమ టార్గెట్ అని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సహా మధ్య ఆసియాలో తీవ్రవాద నెట్‌వర్క్‌లు కొనసాగుతున్నాయని అజిత్ దోవల్ ప్రస్తావించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అందరికీ సంబంధించిన ముఖ్యమైన సమస్య అని గుర్తు చేశారు.  ఆఫ్ఘన్ సహా మధ్య ఆసియా దేశాల్లో తీవ్రవాద నెట్ వర్క్ లు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, సెక్యూరిటీతో సుసంపన్నంగా మధ్య ఆసియా దేశాలు ముందుకు సాగాలని అజిత్ దోవల్ ఆకాంక్షించారు. తీవ్రవాదులకు ఫండింగ్ చేసే దేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.