గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ అరగంట ఆలస్యం.. ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ అరగంట ఆలస్యం..  ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ టెస్ట్ లాంచ్ అరగంట ఆలస్యం అయ్యింది. కౌంట్ డౌన్ ప్రాసెస్ ఆలస్యమవుతోంది. ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చేశారు శాస్త్రవేత్తలు. శనివారం (అక్టోబర్ 21న) ఉదయం 8 :30 గంటలకు ప్రయోగం ప్రారంభంకానుంది. వ్యోమగాములను తీసుకెళ్లే క్రూమాడ్యూల్ ను నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు. 2025లో మానవసహిత గగన్ యాన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 

రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు గగన్‌యాన్‌ ప్రాజెక్టు చేపట్టారు. కీలక ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం (అక్టోబర్ 21న) ఉదయం 8 గంటలకు ప్లాన్ చేసింది. అయితే.. అరగంట ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) అనే పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను విశ్లేషించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరుగుతోంది. ఇప్పటికే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం (అక్టోబర్ 20న) రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది.

గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో టార్గెట్. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. ముందుగా టీవీ-డీ1 పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.