న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ మళ్లీ ఆర్‌బీఐ పెట్టుకున్న లిమిట్ 6 శాతంపైన రికార్డయ్యింది. జులైలో 15 నెలల గరిష్టమైన 7.44 శాతానికి పెరిగింది. కూరగాయలు, పప్పులు, పసుపు, జీలకర్ర వంటి ఫుడ్ ధరలు పెరగడంతో ఇన్‌ఫ్లేషన్ గరిష్టాలకు చేరుకుంటోంది. ఫుడ్ ధరలను పక్కన పెడితే మిగిలిన ప్రొడక్ట్‌ల ధరలు జులైలో పెద్దగా పెరగలేదని చెప్పొచ్చు. ఇంకా జూన్‌తో పోలిస్తే జులైలో తగ్గాయి కూడా. ఫుడ్, బెవరేజేస్‌ను మినహాయించే కోర్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) జులైలో 21 నెలల కనిష్టమైన 5.1 శాతానికి తగ్గింది. జులైలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 6.5 శాతంగా రికార్డవుతుందని ఎనలిస్టులు, నిపుణులు అంచనావేశారు.
ఎప్పుడు తగ్గొచ్చు..
ఇన్‌ఫ్లేషన్ ఇప్పటిలో తగ్గదని ఎకనామిస్ట్‌లు అంచనావేస్తున్నారు. సీపీఐ ఆగస్టులో కూడా 6.5 శాతంపైన ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో దిగొస్తుందని అన్నారు. మరోవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు. పంటలు చేతికి అందడానికి ఇంకా టైమ్ ఉండడమే ఇందుకు కారణం. మరోవైపు ఈ నెలలో వర్షాలు పెద్దగా పడలేదు. ఖరీఫ్ సీజన్‌లో కొన్ని రకాల పంటల విస్తీర్ణం తగ్గే ఛాన్స్ ఉంది.
ఆర్‌బీఐ ఏం చేయొచ్చు?
ఆర్‌బీఐ ఈ నెలలో కీలక వడ్డీ రేటు రెపోను 6.5 శాతం దగ్గర మార్చకుండా ఉంచింది. కానీ అవసరమైనప్పుడు రేట్లను పెంచడానికి రెడీగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం సప్లయ్–డిమాండ్‌లో తేడా ఉండడంతో ఫుడ్ ధరలు పెరుగుతున్నాయి. కానీ, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి మొగ్గు చూపకపోవచ్చని ఎకనామిస్ట్‌లు చెబుతున్నారు. ఇన్‌ఫ్లేషన్ కనీసం రెండు క్వార్టర్ల పాటు 6 శాతం పైన ఉండాలని, అప్పుడు కాని రేట్ల పెంపు గురించి ఆర్‌బీఐ ఆలోచించదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.