మనదేశంలో భారీ ఏఐ సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్ కంపెనీలు లేకపోయినా, చిన్న కంపెనీలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. డేటా సెంటర్లకు, క్లౌడ్సంస్థలకు ఏఐ మౌలిక సదుపాయాలు అందించే ఈ సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. 28 లిస్టెడ్ కంపెనీల వాల్యూ ఈ ఏడాది 47 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,94,800 కోట్లు) చేరింది. వేదాంత గ్రూప్‌నకు చెందిన ఆప్టికల్ ఫైబర్ కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ షేర్లు ఈ ఏడాది 530 శాతానికి పైగా పెరిగాయి.
ఇటీవలే ఇది అమెరికాకు చెందిన ఒక డేటా సెంటర్ కంపెనీ నుంచి 1.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. దీని ప్రత్యర్థి కంపెనీ హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ షేర్లు ఈ ఏడాది 191 శాతం పెరిగాయి. ప్రిసిషన్ కూలింగ్, పవర్ కాంపోనెంట్లను తయారు చేసే ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ విలువ ఈ ఏడాది మూడు రెట్లు పెరిగింది. వీటి ఉమ్మడి మార్కెట్ విలువ ఈ ఏడాది దాదాపు 50 శాతం వృద్ధి చెందింది. ముంబై ఇన్వెస్టర్లు ఈ ట్రెండ్‌ను "ఏఐ క్యాపెక్స్ ట్రేడ్" అని పిలుస్తున్నారు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ శివకుమార్ మాట్లాడుతూ, భారతదేశం ఏఐ సాఫ్ట్‌వేర్ రేసులో ముందుండకపోయినా, ఏఐ మౌలిక సదుపాయాల ఖర్చుల వల్ల లబ్ధి పొందుతుందని తెలిపారు.
అమెజాన్ రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడి
గ్లోబల్ టెక్ కంపెనీలు మనదేశ ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాలలో బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. అమెజాన్ 2030 నాటికి భారతదేశంలో 12.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.06 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఆల్ఫాబెట్ సంస్థ విశాఖపట్నంలో ఏఐ హబ్ కోసం దాదాపు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది. డేటా సెంటర్ల నిర్మాణానికి రిలయన్స్ గతేడాదే 11 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. అదానీ కనెక్స్ సంస్థ గూగుల్, ఉబెర్ టెక్నాలజీస్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
డేటా సెంటర్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కూలింగ్ కోసం అవసరమైన పరికరాలను సరఫరా చేసే కంపెనీలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నోమురా విశ్లేషకులు తెలిపారు. దీంతో హిటాచీ ఎనర్జీ , ఏబీబీ , కమిన్స్ వంటి కంపెనీలు లాభపడుతున్నాయి. షేర్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల అధిక వాల్యుయేషన్ల సమస్య వస్తోందని ఏంజెల్ వన్ హెచ్చరించింది.
