
- ఒక్క గౌతమ్ అదానీకే రూ.88 వేల కోట్ల నష్టం
- అంబానీ సంపద రూ.27 వేల కోట్లు డౌన్
- భారీగా తగ్గిన శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ, దిలీప్ షాంఘ్వీ, సావిత్రి జిందాల్, షాపూర్జీ మిస్త్రీ సంపద
- షేర్లు తగ్గడమే కారణం ..గ్లోబల్‌గానూ ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ: మార్కెట్ పడుతుండడంతో ఇండియన్ బిలియనీర్లు భారీగా నష్టపోతున్నారు. ఈ ఏడాది నిఫ్టీ సుమారు 5 శాతం నష్టపోగా, దేశంలోని టాప్ ఏడు మంది బిలియనీర్లు సుమారు రూ. 3 లక్షల కోట్ల (34 బిలియన్ డాలర్ల)ను కోల్పోయారు. వీరి కంపెనీల షేర్లు గత కొన్ని నెలలుగా పడుతుండడమే ఇందుకు కారణం. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, వీరి మొత్తం సంపద 300 బిలియన్ డాలర్ల (రూ.26 లక్షల కోట్ల) ను దాటింది. అందరికంటే ఎక్కువగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నష్టపోయారు. ఈ ఏడాది ఈయన సంపద 10.1 బిలియన్ డాలర్లు (రూ.88 వేల కోట్లు) తగ్గి 68.8 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్ల) కు పడింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 12 శాతం పడగా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 22 శాతం చొప్పున నష్టపోయాయి. ఇండియాలో నెంబర్ వన్ ధనవంతుడు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూడా పెద్ద మొత్తంలో సంపద కోల్పోయారు. ఆయన సంపద ఈ ఏడాది 3.13 బిలియన్ డాలర్లు (రూ.27 వేల కోట్లు) తగ్గి 87.5 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్ల) కు దిగొచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కిందటి వారం 5 శాతం లాభపడడంతో ముకేశ్ అంబానీ నష్టాలు కొంత రికవర్ అయ్యాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ కంపెనీ షేర్లు 3 శాతం పెరిగాయి. కానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు మాత్రం 29 శాతం పడ్డాయి.
స్టాక్ మార్కెట్ క్రాష్‌తో వీరికీ భారీ నష్టాలే..
- 1హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్‌నాడార్ ఈ ఏడాది 7.13 బిలియన్ డాలర్ల (రూ.62 వేల కోట్ల) ను కోల్పోయారు. ఆయన మొత్తం సంపద 36 బిలియన్ డాలర్ల (రూ.3.13 లక్షల కోట్ల) కు తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు గత నెల రోజుల్లో 12 శాతం పడ్డాయి.
- 2విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ ఈ ఏడాది 2.70 బిలియన్ డాలర్లు (రూ.23 వేల కోట్లు) నష్టపోయారు. ఆయన 28.2 బిలియన్ డాలర్ల (రూ.2.45 లక్షల కోట్ల) కు తగ్గింది. విప్రో షేర్లు గత నెల రోజుల్లో 17 శాతం పతనమయ్యాయి.
- 3షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీల షేర్లు పడడంతో గ్రూప్ ఫౌండర్ షాపూర్జీ మిస్ట్రీ ఈ ఏడాది 4.52 బిలియన్ డాలర్లు (రూ.39 వేల కోట్లు) నష్టపోయారు. ఆయన సంపద 34.1 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్ల) కు పడింది.
- 4ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ సంపద 2.22 బిలియన్ డాలర్లు (రూ.19 వేల కోట్లు) తగ్గి 30.1 బిలియన్ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్ల) కు పడింది.
- 5సన్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ దిలీఫ్ షాంఘ్వీ ఈ ఏడాది 4.21 బిలియన్ డాలర్లు (రూ.37 వేల కోట్లు) కోల్పోయారు. ఆయన సంపద 25.3 బిలియన్ డాలర్లకు (రూ.2.53 లక్షల కోట్ల) తగ్గింది.
గ్లోబల్‌గా అనిశ్చితి..
గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉండడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లూ గత కొన్ని నెలలుగా పడుతున్నాయి. యూఎస్ బాండ్ ఈల్డ్‌లు, డాలర్ పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ పాలసీ మార్కెట్‌లో అనిశ్చితి పెంచుతోంది. టెక్నాలజీ, ఎనర్జీ షేర్లు ఎక్కువగా పడుతున్నాయి. గ్లోబల్‌గా చూసినా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ వంటి టాప్ బిలియనీర్లు ఈ ఏడాది భారీగా నష్టపోయారు. మస్క్ 126 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) కోల్పోగా, జెఫ్ బెజోస్ (అమెజాన్) 21.2 బిలియన్ డాలర్లు (రూ.1.84 లక్షల కోట్లు), మార్క్ జూకర్‌బర్గ్ (మెటా) 6.61 బిలియన్ డాలర్లు (రూ.58 వేల కోట్లు) నష్టపోయారు.