
- ఇండియా ఆయిల్ దిగుమతుల్లో 40 శాతం ఈ దేశం నుంచే
- జూన్‌లో 2.08 బీపీడీకి చేరుకున్న సప్లయ్
- రెండో ప్లేస్‌లో ఇరాక్
- అమెరికా నుంచీ పెరుగుతున్న క్రూడాయిల్
న్యూఢిల్లీ: రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్ వేస్తామని ఒకవైపు అమెరికా హెచ్చరిస్తున్నా, ఇండియా మాత్రం ఈ ఏడాది జూన్‌లో రికార్డ్ లెవెల్లో రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఈ దేశం నుంచి చేసుకున్న క్రూడాయిల్ దిగమతులు 11 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్-, ఇరాన్ యుద్ధం వలన ఇండియన్ రిఫైనరీలు తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయి. ఫలితంగా రష్యా నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. రీసెర్చ్ కంపెనీ కెప్లర్ డేటా ప్రకారం, జూన్‌లో భారత్ 2.08 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే(బీపీడీ) రష్యన్ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇది జులై 2024 తర్వాత అత్యధికం. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ప్రకారం, ఇండియా జూన్‌లో చేసుకున్న మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతులు నెల ప్రాతిపదకన 6 శాతం తగ్గాయి. అయినప్పటికీ రష్యన్ ఆయిల్ దిగుమతులు మాత్రం 8 శాతం పెరిగాయి. ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొని, లోకల్‌గా శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి బై ప్రొడక్ట్‌లను జీ7 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఇండియా తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడుతోంది. గతంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్‌ను దిగుమతి చేసుకునే వాళ్లం. కానీ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా భారత్‌కు అతిపెద్ద క్రూడ్ సరఫరాదారుగా మారింది. వెస్ట్రన్ దేశాల ఆంక్షలతో ఈ దేశం అమ్మే క్రూడాయిల్ రేటు బాగా పడిపోయింది. దీనిని సద్వినియోగం చేసుకున్న భారత రిఫైనరీలు, రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఇండియా చేసుకుంటున్న క్రూడాయిల్ దిగుమతుల్లో సుమారు 40శాతం రష్యా నుంచి వస్తోంది.
ఏయే దేశాల నుంచి ఎంతంటే?
ఇండియా ఈ ఏడాది జూన్‌లో ఇరాక్ నుంచి 8,93,000 బీపీడీ దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో చేసుకున్న దిగుమతులతో పోలిస్తే 17.2 శాతం తక్కువ. సౌదీ అరేబియా నుంచి 5,81,000 బీపీడీ (మే నెలతో సమానంగా), యూఏఈ నుంచి 4,90,000 బీపీడీ (6.5శాతం పెరుగుదల) దిగుమతి చేసుకుంది. ఇండియా ఆయిల్ దిగుమతుల్లో ఇరాక్ వాటా 18.5శాతంగా, సౌదీ అరేబియా 12.1శాతంగా, యూఏఈ 10.2శాతంగా ఉంది. అమెరికా ఐదో అతిపెద్ద సరఫరాదారుగా కొనసాగుతోంది. ఈ దేశం నుంచి 3,03,000 బీపీడీ ఆయిల్‌ను జూన్‌లో దిగుమతి చేసుకున్నాం. ఇండియా మొత్తం ఆయిల్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.3 శాతానికి పెరిగింది. సీఆర్‌ఈఏ ప్రకారం, జూన్‌లో రష్యా జరిపిన క్రూడాయిల్ ఎగుమతుల్లో చైనా వాటా 47శాతంగా, భారత్ వాటా 38శాతంగా నమోదైంది. ఈయూ, టర్కీ వాటాలు 6 శాతం చొప్పున ఉన్నాయి. భారత్ రష్యా నుంచి 4.5 బిలియన్ యూరో (సుమారు రూ.45 వేల కోట్ల) విలువైన ఫాసిల్ ఇంధనాలను దిగుమతి చేసుకుంది. ఇందులో క్రూడ్ ఆయిల్ వాటానే 80శాతంగా ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత్‌కు అమెరికా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులు 2024 లోని ఇదే టైమ్‌తో పోలిస్తే 50శాతం పెరిగాయి. బ్రెజిల్ నుంచి దిగుమతులు 80శాతం పెరిగాయి. రష్యన్ ఆయిల్‌పై దృష్టి సారించడంతో గత రెండు-మూడు సంవత్సరాల్లో అమెరికా నుంచి దిగుమతులు
తగ్గాయి.