IndiGo దెబ్బకు సొంత పెళ్లి రిసెప్షన్ మిస్ అయిన కొత్తజంట.. చేసేది లేక వీడియో కాల్ లోనే..

IndiGo దెబ్బకు సొంత పెళ్లి రిసెప్షన్ మిస్ అయిన కొత్తజంట.. చేసేది లేక వీడియో కాల్ లోనే..

ప్రస్తుతం దేశంలో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న విమాన ప్రయాణాల సమస్య అందరినీ తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావటంతో ప్రయాణాలు స్థంభించిపోయాయి. దీంతో బెంగళూరుకు చెందిన ఓ నవదంపతులు తమ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లలేక వర్చువల్‌గా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భువనేశ్వర్ నుంచి హుబ్బళ్లికి వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దవడంతో కొత్త జంట చివరికి వీడియో కాల్ లోనే కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చింది. విమానాల రద్దు ముఖ్యమైన క్షణాలను సైతం ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ సంఘటన చూపుతోంది.

మేధా క్షీరసాగర్, సంగమ దాస్ అనే ఈ జంట నవంబర్ 23న భువనేశ్వర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే డిసెంబర్ 3న వధువు స్వస్థలమైన హుబ్బళ్లిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు విమానం రద్దవడంతో వారు తమ రిసెప్షన్‌కు చేరుకోలేకపోయారు. అప్పటికే పెళ్లికూతురు పేరెంట్స్ బంధువులను ఆహ్వానించి ఉండడం, చివరి నిమిషంలో రిసెప్షన్‌ను రద్దు చేయడం సాధ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త దంపతులిద్దరూ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్‌పై కనిపించేలా చేయాల్సి వచ్చింది. వధూవరుల కోసం స్టేజ్ మీద ఏర్పాటు చేసిన కుర్చీల్లో తల్లిదండ్రులే కూర్చున్నారు. కొత్త జంట హుబ్బళ్లికి రాలేకపోయినా, వీడియో కాల్‌లోనే ముస్తాబై అతిథులను పలకరించారు. 

ఈ సంఘటన ఇండిగో సంస్థలో నెలకొన్న తీవ్ర సంక్షోభం మధ్య వెలుగులోకి వచ్చింది. గడచిన 3 రోజులుగా విమానయాన సంస్థ వందలాది సర్వీసులను రద్దుచేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైలట్లు, సిబ్బంది కొరత, కొత్తగా అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల సమస్యలు, శీతాకాల షెడ్యూల్ సర్దుబాట్లే ఈ గందరగోళానికి కారణమని ఇండిగో తెలిపింది. రంగంలోకి దిగిన ఏవియేషన్ మినిస్ట్రీ FDTL రూల్స్ రద్దును వెంటనే అమలులోకి తీసుకొచ్చింది. 

►ALSO READ | శబరిమలలో హైటెన్షన్.. తెలుగు భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి.. అయ్యప్ప మాలధారుల భారీనిరసన

ప్రస్తుత పరిస్థితులపై బహిరంగంగా క్షమాపణ చెప్పిన ఇండిగో, కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి "సర్దుబాట్లు" చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 10, 2026 నాటికి విమాన షెడ్యూల్‌ను పూర్తిగా పునరుద్ధరిస్తామని విమానయాన నియంత్రణ సంస్థ DGCAకి తెలిపింది.