ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్లాల్సని ఇండిగో విమానం 6E2131 టేకాఫ్ అవుతుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్ పోర్ట్ లోనే ఫ్లైట్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 184మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. వీరిలో177 మంది ప్రయాణికులు కాగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై అప్పుడే బయలుదేరిందని.. సమస్యను గుర్తించి దాన్ని నిలిపివేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన రాత్రి 9.45నిమిషాలకు జరిగినట్టు సమాచారం. వెంటనే సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. 

ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రియాంక కుమార్ అనే ప్రయాణికుడు రన్‌వేపై నిప్పురవ్వలు ఎగసిపడుతున్న వీడియోను ట్వీట్ చేశారు. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. ప్రయాణీకులకు కలిగించిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని తెలిపింది. టేకాఫ్ రోల్ సమయంలో సాంకేతిక లోపంతో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు తెలిపింది. దీనిపై ఎయిర్‌లైన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు బయలుదేరిన విమానం 6E2131 టేకాఫ్ రోల్‌లో ఉన్నప్పుడు సాంకేతిక సమస్యను ఎదుర్కొందని.. వెంటనే పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశారని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది.