త్రిశ్శూర్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి సురేశ్ గోపి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’ గా అభివర్ణించారు. కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్ట్ నేత ఈకే. నాయనార్లు తన రాజకీయ గురువులని తెలిపారు. శనివారం సురేశ్ గోపి త్రిశ్శూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పున్ కున్నంలో ఉన్న కరుణాకరన్ మెమోరియల్ మురళీ మందిరాన్ని సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
‘‘నా గురువు కరుణాకరన్‌కు నివాళులు అర్పించేందుకే ఇక్కడికి వచ్చాను. ఈ పర్యటనకు ఎటువంటి రాజకీయాలను ఆపాదించొద్దు. కరుణాకరన్, ఆయన భార్య కల్యాణి కుట్టి, మార్క్సిస్ట్ నేత నాయనార్, ఆయన భార్య శారద టీచర్‌తో నాకు మంచి అనుబంధం ఉండేది” అని చెప్పారు. ఈ సందర్భంగానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియాగా కేంద్ర మంత్రి సురేశ్ గోపి అభివర్ణించారు. అనంతరం లార్డెస్ మెట్రోపాలిటన్ కాథడ్రెల్ చర్చికి వెళ్లి సురేశ్ గోపి ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చర్చికి బంగారు కిరీటం సమర్పించిన ఎంపీ.. తాజాగా బంగారు జపమాలను అందించారు.