సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్  బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్  గైక్వాడ్  రఘునాథ్ తో కలిసి సీఎం ఆవిష్కరించే పైలాన్, చెంచుల పొలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఏండ్లుగా అడవులను నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని తెలిపారు. 

నల్లమలలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు వస్తుండడం హర్షణీయమని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని గిరిజనుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లమలలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం బహిరంగ సభకు గిరిజనులతో పాటు అన్నివర్గాల ప్రజలు హాజరై సక్సెస్​ చేయాలని కోరారు.