- మంజూరు 9534 ప్రోగ్రెస్‌లో 6565 ఇండ్లు
- 1700 లబ్ధిదారులకు రూ. 20.63 కోట్ల లోన్
- 7800 ఇండ్లకు సబ్సిడీపై మెటీరియల్
యాదాద్రి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం యాదాద్రి జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. కలెక్టర్అడిషనల్ కలెక్టర్లు సహా హౌసింగ్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ కారణంగానే ఇండ్ల నిర్మాణంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి జిల్లా ముందంజలో కొనసాగుతోంది.
కొత్త వారికి ఇండ్లు మంజూరు
యాదాద్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాలు సహా మొదటి విడతలో 9534 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిలో 7857 మంది లబ్దిదారులు ముగ్గులు పోసి నిర్మాణం ప్రారంభించారు. 29 ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో పాటు వివిధ దశల్లో 6565 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. అయితే రోజులు గడుస్తున్నా.. కొందరు ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
దీంతో వారిని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆరా తీయగా వివిధ కారణాల వల్ల తాము మొదటి విడతలో ఇండ్లు నిర్మించుకోలేమని, తమకు రెండో దశలో మంజూరు చేయాలని 336 మంది కోరారు. దీంతో వారి స్థానంలో ఎల్ 1 జాబితాలో పేరున్న 336 మంది లబ్దిదారులను గత నెలలో ఎంపిక చేసి ప్రొసిడింగ్స్ అందించారు.
1700 మందికి రూ. 20.63 కోట్లు రుణాలు
ఇండ్లు మంజూరు సమయంలోనే పేదలకు రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాణం ప్రారంభించడానికి కొందరికి డబ్బు సమకూరకపోవడంతో వెనుకడుగు వేశారు. ఇది గుర్తించిన జిల్లా ఆఫీసర్లు వారికి మహిళా సంఘాలు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు నుంచి రుణం అందించే విధంగా సెర్ఫ్, మెప్మా చర్యలు తీసుకుంది.
సభ్యుల అవసరం, అర్హతను బట్టి ఒక్కొక్కరికి రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకూ రుణం అందిస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో 1700 మందికి రూ. 20, 63, 90,000 రుణం పొందారు. నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేసే సొమ్ములోంచి తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉంటుంది.
సబ్పిడీపై మెటీరియల్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో కొందరు సప్లయిదారులు మెటేరియల్ రేట్లు పెంచివేశారు. దీంతో ఆఫీసర్లు రంగంలోకి మండలాల వారీగా సప్లయిదారులతో చర్చలు నిర్వహించారు. ఇసుక, సిమెంట్, కంకర, స్టీల్ రేట్లను నిర్ణయించారు. నిర్ణయించిన రేట్ల కంటే ఏమాత్రం ఎక్కువ రేటుకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో 7800 ఇండ్లకు నిర్ణయించిన రేట్లకే మెటీరియల్ తీసుకుంటున్నారు.
ఇండ్ల నిర్మాణం ఇలా
నిర్మాణం స్టార్ట్ 7857
బీస్మెంట్ లెవల్ 3585
రెంటల్ లెవల్ 1642
స్లాబ్‌లెవల్ 1309
కంప్లీట్ 29
