వైరాలో ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు..చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరాలో ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు..చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరా, వెలుగు :  వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 20 వార్డులకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లాంటి పథకాలన్నీ మహిళలకే ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

 నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని, ఇందులో భాగంగా వైరాకు 100 పడకల ఆస్పత్రిని, విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకువచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ. 17 కోట్లు మంజూరు చేశామని, వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, త్వరలోనే నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు. 

తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణాన్ని అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పీసీస కార్యదర్శి కట్ల రంగారావు, పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.