చిగురుమామిడి/సైదాపూర్, వెలుగు: రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ప్రభుత్వ సారె ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడిలోని ఓ గార్డెన్స్‌లో ఆదివారం దాదాపు 500 మందికి చీరలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల నిర్ణయం మేరకు చీరలను సిరిసిల్లలో నేయించి, అందిస్తున్నట్లు చెప్పారు. పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు ఇవ్వాలి
సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లను అందిస్తోందని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు చీర ఇచ్చే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని కోరారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, డీఆర్డీవో శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ స్వశక్తి మహిళా భవన్లో..
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని స్వశక్తి మహిళా భవన్ లో ఆదివారం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్ట్ మస్ పండుగలకు దుస్తులు అందించారని గుర్తు చేశారు.
ఆ సంప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించడం సంతోషకరమని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు మధు, మహేశ్ గౌడ్, డీఆర్డీఏ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
