హుస్నాబాద్, వెలుగు: పాత కక్షలతో ఓ వ్యక్తిని కులం నుంచి బహిష్కరించిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని చేపల చెరువు విషయంలో గతంలో ఆకుల బాలయ్యకు, కొందరు గ్రామస్తులకు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ కేసు కోర్టులో నడవగా, ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాలు అంగీకారంతో రాజీ కుదుర్చుకున్నాయి.
చట్టపరంగా సమస్య ముగిసినా గ్రామంలోని కొందరు పెద్దమనుషులు బాలయ్యపై కక్ష పెంచుకుని ఆయనను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఎర్రవెల్లి నర్సయ్య మృతిచెందగా పరామర్శించేందుకు బాలయ్య వెళ్లాడు. కాగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు. బాలయ్య అక్కడ ఉంటే కులస్తులు అంత్యక్రియలకు హాజరుకారని కొందరు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
బాలయ్య కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దని, ఇంటికి వెళ్లినా, భోజనం చేసినా భారీ జరిమానాలు విధిస్తామని కులపెద్దలు కండీషన్లు పెట్టారని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై బాలయ్య హుస్నాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
