ఇండో-చైనా బార్డర్ సెగ.. అయోధ్య టెంపుల్ భూమి పూజ వాయిదా

ఇండో-చైనా బార్డర్ సెగ.. అయోధ్య టెంపుల్ భూమి పూజ వాయిదా

అయోధ్య: ఇండియా చైనా బార్డర్ ఇష్యూ సెగ అయోధ్య టెంపుల్ నిర్మాణానికి తగిలింది. బార్డర్ లో జరిగిన ఘర్షణలో మన 20 మంది సైనికులను చైనా పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలోని అయోధ్యలోనూ చైనాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. హిందూ మహాసభ కార్యకర్తలు గురువారం చైనా జెండాను తగలబెట్టగా.. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను తగలబెట్టి, చైనా వస్తువులను ధ్వంసం చేశారు. ఈ మేరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది.

‘‘దేవాలయ నిర్మాణం పనులు ప్రారంభించే నిర్ణయం దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం”అని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ఒక స్టేట్​మెంట్​లో తెలిపారు. ఇండియా చైనా బార్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్న ఇలాంటి సమయంలో ఆలయ భూమి పూజ నిర్వహించడం సరికాదని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

చారిత్రాత్మక అయోధ్య ఆలయం భూమి ఇష్యూ సుప్రీం కోర్టులో తేలిన తర్వాత రామ మందిరాన్ని నిర్మించేందుకు భూమి చదును పనులను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. లాక్​డౌన్ కారణంగా నిలిచిపోయిన పనులు కాస్తా.. సడలింపుల మేరకు ఈ మధ్యే మళ్లీ ప్రారంభయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించిన యూపీ సర్కార్.. అందుకు అనుగుణంగా పనులు కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండో చైనా బార్డర్ లో ఆర్మీ జవాన్ల వీరమరణంతో యావత్ దేశం అట్టుడుకుతోంది. దీంతో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం కొద్ది రోజులవరకు పోస్టు పోన్ చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది.