న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.2,040 కోట్ల లాభం సంపాదించింది. 2022 మార్చి క్వార్టర్ లాభం రూ.1,361 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. ఇండస్‌ఇండ్‌కు ఈసారి లాభం 43 శాతం పెరుగుతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి. ఇదేకాలంలో బ్యాంకు ఆదాయం వార్షికంగా 16శాతం పెరిగి రూ.4,669.46 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో షేరుకు రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంకు బోర్డు సిఫార్సు చేసింది. అయితే ఇందుకు ఏజీఎం మీటింగ్‌లో షేర్హోల్డర్లు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఫలితాలు బాగా వచ్చినప్పటికీ ఈ బ్యాంక్ స్టాక్ సోమవారం 1.34 శాతం నష్టపోయి రూ.1,101.35 వద్ద ముగిసింది. రిజల్ట్స్ తరువాత ఈ సంస్థ షేర్లు ఒత్తిడికి గురయ్యాయని,
ప్రస్తుతం ధరలు కన్సాలిడేషన్దశలో ఉన్నాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. 1,070–1,060 మధ్యలో బలమైన మద్దతు కనిపిస్తోందని, 1,150– 1,160 మధ్యలో రెసిస్టెన్స్ ఉందని ఏంజెల్ వన్ ఈక్విటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్ ఎనలిస్ట్-రాజేష్ భోసాలే అన్నారు. మొత్తం బ్యాంక్ నిఫ్టీ పనితీరును పరిగణనలోకి తీసుకుంటే, షేరు ధర మరింత తగ్గితే కొనుక్కోవచ్చని వివరించారు. తాజా క్వార్టర్లో, బ్యాంక్ మొత్తం ఆదాయం సంవత్సరానికి 16శాతం పెరిగి రూ.6,823 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం 13శాతం పెరిగి రూ.2,514 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 17శాతం పెరిగి రూ.4,669 కోట్లు అయింది. కేటాయింపులు 29శాతం తగ్గి రూ.1,030 కోట్లుగా రికార్డయ్యాయి. గ్రాస్ ఎన్పీఏలు తగ్గాయి. సీక్వెన్షియల్‌గా గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తి 2.06శాతం నుండి 1.98శాతంకి తగ్గింది. క్రితం సంవత్సరం మార్చి-క్వార్టర్లో 2.27శాతానికి తగ్గింది. నెట్ ఎన్పీఏలు సీక్వెన్షియల్‌గా 0.62శాతం నుంచి 0.59శాతానికి తగ్గాయి. 2022 మార్చి క్వార్టర్లో ఇవి 0.64 శాతంగా రికార్డయ్యాయి. ఇదిలా ఉంటే సుమంత్ కత్పాలియాను తిరిగి బ్యాంకు ఎండీ, సీఈఓగా నియమించాలన్న ప్రపోజల్‌కు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఆయన రెండేళ్లపాటు పదవిలో ఉంటారు. సోమవారం నుంచే ఆయన పదవీకాలం మొదలవుతుందని ఇండస్ఇండ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 135 శాతం అప్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2022–23 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ. 840 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. కిందటి సంవత్సరం క్యూ4 లాభం రూ. 355.2 కోట్లతో పోలిస్తే ఇది 135 శాతం ఎక్కువ. తాజా క్వార్టర్లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 2,187 కోట్లుగా ఉంది. ఇది కిందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఎన్ఐఐ రూ. 1,612 కోట్లతో పోలిస్తే 35.7 శాతం ఎక్కువ. 2023, మార్చి 31 నాటికి బ్యాంక్ నెట్నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) 2.47 శాతంగా ఉన్నాయి. ఇది మూడవ క్వార్టర్ ముగింపులో నమోదైన దానికంటే 2.94 శాతం కంటే తక్కువ. కిందటి క్వార్టర్లో 0.47 శాతంగా ఉన్న నికర ఎన్పీఏ కూడా 0.25 శాతానికి తగ్గింది.
క్యూ4లో బ్యాంక్ కేటాయింపులు రూ. 945 కోట్లుగా ఉన్నాయి. ఇవి డిసెంబరు క్వార్టర్లోని కేటాయింపులు రూ. 582 కోట్లతో పోలిస్తే 62 శాతం ఎక్కువ. 2022 మార్చి క్వార్టర్లో కేటాయింపులు రూ. 365.4 కోట్లతో పోలిస్తే 158 శాతం ఎక్కువ. ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు లాభపడ్డాయి. ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డైరెక్టర్ల బోర్డు ఏప్రిల్ 24న జరిగిన బోర్డ్ మీటింగ్‌లో 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.7,500 కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫాలో -ఆన్- పబ్లిక్ ఆఫర్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ , ప్రిఫరెన్షియల్ ఇష్యూ మొదలైన వాటితో ఫండ్స్‌ను సేకరిస్తుంది. బేసెల్–3 వంటి సెక్యూరిటీలతోనూ మూలధనాన్ని సమకూర్చుకుంటుంది.