కరెంట్ అఫైర్స్: నిజాం రాజ్యం​లో పరిశ్రమలు

కరెంట్ అఫైర్స్: నిజాం రాజ్యం​లో పరిశ్రమలు

హైదరాబాద్​ రాజ్యంలో పారిశ్రామిక అభివృద్ధి మూడు దశల్లో జరిగింది. మొదటి దశ సాలార్​జంగ్​–1 ప్రధానిగా ఉన్న 1870లో మొదలై 1918 వరకు కొనసాగింది. రెండో దశ 1919లో మొదలై 1939లో అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలం, మూడో దశను రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం(1939) నుంచి 1948 వరకు కొనసాగింది. సాలార్​జంగ్​–1 సంస్కరణల ఫలితంగా ఆధునిక రవాణా, సమాచార రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ద్వారా తెలంగాణ ప్రాంతంలో నూనె ఉత్పత్తులు, మరాఠ్వాడ ప్రాంతంలో పత్తి ఉత్పత్తులు మొదలయ్యాయి.

1899లో హైదరాబాద్​ గోదావరి వ్యాలి రైల్వేలైను మన్​మాడును కలుపుతూ ఏర్పాటు చేసిన దానివల్ల ఆ ప్రాంతాలతో పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్​, జిన్నింగ్​ పరిశ్రమలను నెలకొల్పడానికి తోడ్పడింది. హైదరాబాద్​ దక్కన్​ స్పిన్నింగ్, వీవింగ్​ మిల్స్​ లిమిటెడ్​ (1877), మహబూబ్​శాయి గుల్​బర్గా మిల్స్​ (1884), ఔరంగాబాద్​ మిల్స్​ (1888) స్థాపించారు. డోర్నకల్​ జంక్షన్​ నుంచి సింగరేణి బొగ్గు గనులకు వేసిన రైలుమార్గం ద్వారా బొగ్గు రవాణా సులువైంది. 1901 వరకు అన్ని రకాల పరిశ్రమలు కలిపి 68 వరకు స్థాపించబడ్డాయి. 

ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​

బ్రిటిష్​ ఇండియాలో పారిశ్రామికీకరణ పూర్తిగా ప్రైవేట్​ ఆధ్వర్యంలో జరిగింది. కాని హైదరాబాద్​ రాజ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగింది. ఇందుకోసం 1929లో ప్రభుత్వం కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేస్తూ పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్​ ట్రస్టు ఫండ్​(ఐటీఎఫ్​)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ నిధిని కోటి నుంచి మూడు కోట్లకు పెంచారు. చిన్న పరిశ్రమలకు అప్పుగా ఇచ్చి వాటిని ప్రోత్సహించడంతోపాటు అక్కడ నుంచి వచ్చిన లాభాలను చిన్నతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. అంతకుముందు 1917లో ఇండస్ట్రియల్​ లేబరేటరి, 1918లో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేశారు. 

డీబీఆర్​ మిల్లు(1920): దివాన్​ బహదూర్​ రాంగోపాల్​ మిల్లు. దీన్నే డీబీఆర్​ మిల్స్​ అంటారు. ఈ మిల్లును 1920, ఫిబ్రవరి 14న హైదరాబాద్​ లోయర్​ ట్యాంక్​బండ్​లో స్థాపించారు. ఇది ప్రైవేట్​ కంపెనీ. బయట నుంచి తీసుకువచ్చిన ముడిసరుకులతో బట్టలు తయారు చేసే పరిశ్రమ. ప్రస్తుతం మూత పడింది.

సింగరేణి కాలరీస్​(1921): దీనిని ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామం పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడే మొదట బొగ్గు గనులు బయటపడ్డాయి. లండన్​కు చెందిన హైదరాబాద్​ దక్కన్​ మైనింగ్​ కంపెనీ సింగరేణి నుంచి బొగ్గు గనులు తవ్వడం ప్రారంభించింది. మొదట్లో దీనిపై పర్యవేక్షణాధికారమంతా ప్రభుత్వాధీనంలోనే ఉండేది. 1920 తర్వాత సింగరేణి కాలరీస్​ కంపెనీ(ఎస్​సీసీ) అనే సంస్థ ప్రభుత్వ ఆర్థిక సాయంతో ముందుకువచ్చి పరిపాలనా బాధ్యతలు చేపట్టింది. 

నిజాం చక్కెర పరిశ్రమ(1937): నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​ పట్టణంలో స్థాపించారు. 

ఆల్విన్​ మెటల్​ వర్క్స్​: ఆల్విన్​ లిమిటెడ్​ను 1942, జనవరిలో ఆల్విన్​ మెటల్​  వర్క్స్​గా నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్​ ట్రస్ట్​ ఫండ్​, మెసర్స్​ అల్లావుద్దీన్​ అనే కంపెనీ ఉమ్మడి వ్యవస్థతో స్థాపించారు. 

ప్రాగాటూల్స్​: సికింద్రాబాద్​లోని కవాడిగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే ఉద్దేశంతో ప్రాగా టూల్స్​ కార్పొరేషన్​ అనే పేరుతో 1943, మేలో స్థాపించారు.  1963లో ప్రాగాటూల్స్​ లిమిటెడ్​గా మారుస్తూ డిఫెన్స్​ మినిస్ట్రీకి అప్పగించారు. 

సర్​సిల్క్​: సిరిపూర్​ కాగజ్​నగర్​ ప్రాంతంలో సిరిపూర్​ పేపర్​ మిల్లును ఏర్పాటు చేయడం వల్ల దీన్ని సిరిపూర్​ పేపర్​ మిల్లు(ఎస్​పీఎం)గా పిలుస్తారు. ఈ పేపర్​ మిల్లు భారతదేశంలో స్థాపించిన మొదటి పరిశ్రమల్లో ఒకటి. 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. 

వజీర్​ సుల్తాన్​ టుబాకో కంపెనీ: ఈ పరిశ్రమను 1916లో హైదరాబాద్​ విటల్​వాడిలో వజీర్​ సుల్తాన్​ ప్రారంభించారు. ఈ పరిశ్రమను 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతమున్న వీఎస్​టీ అంటే ముషీరాబాద్​ – అజామాబాద్​కు మార్చారు. 

కర్ఖానా జిందా తిలస్మాత్​: ఈ కంపెనీ ప్రజలు బాగా ఉపయోగించే జిందాతిలస్మాత్​, ఫారూకి పళ్లపొడి, జిందాబామ్​ అనే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమను 1920లో హకీలం మహ్మద్​ మొహినుద్దీన్​ ఫారూకి హైదరాబాద్​లో స్థాపించారు. 

ఆజమ్​జాహిమీల్స్​: ఇది బట్టలు ఉత్పత్తి చేసే పరిశ్రమ. 1934లో వరంగల్​లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైంది. 

హైదరాబాద్​ స్టేట్​ బ్యాంక్​: 1941లో మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకును నెలకొల్పాడు. దీన్నే ఆ రోజుల్లో హైదరాబాద్​ స్టేట్​ బ్యాంక్​ అనేవారు. ఆ తర్వాత స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ హైదరాబాద్​గా మారింది. 

పారిశ్రామిక ప్రదర్శన

19వ శతాబ్ది మధ్యభాగంలో సాలార్​ జంగ్​ –1 పాలనా కాలంలో  మొదట పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన ప్రారంభమైంది. 1930లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్​ అసోసియేషన్​ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు ప్రతి సంవత్సరం హైదరాబాద్​లో నిర్వహించడం ప్రారంభమైంది. చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ముల్కీ ఇండస్ట్రీస్​ అనే పత్రికను ప్రారంభించింది. ఆ తర్వాత చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం కాటేజ్​ ఇండస్ట్రియల్​ ఇన్​స్టిట్యూట్​(సీఐఐ)ను ఏర్పాటు చేసింది.