ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..మోక్షం ఎప్పుడో..!

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు..మోక్షం ఎప్పుడో..!
  •     అమలుకు నోచుకోని హామీలు
  •     భూమిని చదును చేసి రోడ్లు వేసినా రాని ఇండస్ట్రీస్
  •     కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఇండస్ట్రీస్​ ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్​ఏర్పాటు హామీలకే పరిమితమవుతోంది. అందుబాటులో వనరులు ఉన్నా అడుగులు ముందుకు పడట్లేదు. జిల్లాలో 2 చోట్ల పుడ్ ప్రాసెసింగ్​యూనిట్లు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. సదాశివనగర్​మండలంలో భూ సేకరణ చేపట్టి డెవలప్ మెంట్​చేసినప్పటికీ యూనిట్ల ఏర్పాటు మాత్రం జరగలేదు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో తొలి మెగా ఫుడ్​పార్కు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో కూడా ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా ఇక్కడి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వనరులు పుష్కలం..

రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం, రవాణాపరంగా రైల్వే లైన్​, 2 హైవేలు, ప్రభుత్వ భూములు ఇలా కామారెడ్డి జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. పంటల సాగు గణనీయంగా ఉండడంతో ఇండస్ట్రీయల్​జోన్​ కోసం  భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో  ఏడేళ్ల క్రితం భూములు పరిశీలించారు. కామారెడ్డి ఏరియాతో పాటు జుక్కల్​ నియోజకవర్గంలో  ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సదాశివనగర్​ మండలం లింగంపల్లి, జనగామ, తాడ్వాయి మండలం కరడ్​పల్లి శివారులో  9 ఎకరాల భూమిని సేకరించారు. స్టేట్​ఇండస్ట్రీయల్ ఇన్​ఫ్రాస్టక్చర్​కార్పొరేషన్​ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్​మెంట్​వర్క్స్ సైతం​చేపట్టారు. భూమిని చదును చేసి మెయిన్, ఇంటర్నల్​ రోడ్లు వేశారు. జిల్లాలో ప్రధానంగా  వరి, మక్క, సోయా, పత్తి పంటలు సాగు అవుతుండడంతో ఆయా యూనిట్లు ఏర్పాటు చేసే వారికి ఈ భూములు కేటాయించనున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. కానీ, గత ప్రభుత్వం హయాంలో మాటలకు తగ్గట్టుగా అడుగులు ముందుకు పడలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా.. 

జిల్లాలో ఇండస్ట్రీస్​ లేవు.  స్థానికులకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం.  ఉపాధి కోసం ఇక్కడి యువత గల్ఫ్​​ దేశాలు, ఇతర స్టేట్స్, హైదరాబాద్​కు వలస వెళ్తున్నారు.  ఇక్కడ ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయటం ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. పంటలకు గిట్టుబాటు ధర రావడంతోపాటు ఆయా ఏరియాలు డెవలప్​మెంట్ కావటానికి ఆస్కారం ఉంటుంది.

ఇప్పటికే సదాశివనగర్​ మండలం లింగంపల్లి  శివారులో  ప్రాసెసింగ్​ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన విధంగా కొంత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కామారెడ్డి జిల్లాలో  పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.