
ముంబై: దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ల కారణంగానే ఇన్ఫ్లేషన్ తగ్గడం లేదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరళ్ ఆచార్య చెప్పారు. రిటెయిల్, రిసోర్సెస్, టెలికమ్యూనికేషన్స్ రంగాలలో ధరల నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తున్న అయిదు పెద్ద కార్పొరేషన్లు...రిలయన్స్గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్..భారతి టెలికంలను విడగొట్టడం బెటరని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరళ్ ఆచార్య సూచించారు. దేశంలోని చిన్న బిజినెస్‌లకు మనుగడ లేకుండా చేసే, ఈ అయిదు కార్పొరేషన్లు భారీగా ఎదగగలిగాయని పేర్కొన్నారు. విదేశీ కంపెనీల పోటీ తట్టుకునేందుకు ఈ బిగ్ 5 కార్పొరేట్లకు ప్రభుత్వం కూడా సాయపడిందని, అదెలాగంటే, చాలా వస్తువులపై అధిక డ్యూటీలను కొనసాగించడం ద్వారానేనని విరళ్ ఆచార్య వివరించారు. నేషనల్ ఛాంపియన్లను సృష్టించాలనేదే న్యూ ఇండియా ఇండస్ట్రియల్ పాలసీగా అనుకుంటున్నారని, ఇదే నేరుగా దేశంలో రేట్లు ఎక్కువ లెవెల్ ఉండేందుకు కారణమవుతోందని చెప్పారు. 2017–2019 మధ్య కాలంలో విరళ్ ఆచార్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రేట్ల నిర్ణయంలో బిగ్5 కార్పొరేషన్ల పాత్ర తగ్గేలా చేసేందుకు, వాటిని విడగొట్టాల్సిందేనని చెప్పారు. ఎమర్జింగ్ మార్కెట్లపై బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ ప్యానెల్‌కు సబ్మిట్ చేయడానికి విరళ్ ఆచార్య ఒక పేపర్ రాశారు. ఆ పేపర్లోనే ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా డిస్కస్ చేశారు. హిస్టారికల్‌గా చూస్తే, దేశంలోని చిన్న చిన్న కంపెనీలు పెద్ద కార్పొరేషన్ల ప్రొడక్టివిటీ గెయిన్లను అందుకోలేకపోయాయని విరళ్ ఆచార్య అన్నారు. ఇన్పుట్ రేట్లు తగ్గినా కూడా ఆ ఫలాలను దేశంలోని కన్జూమర్లు అందుకోలేకపోతున్నారని వాపోయారు. మెటల్స్ తయారీ, కోక్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్టులతోపాటు, రిటెయిల్ ట్రేడ్, టెలికం రంగాలనూ ఈ బిగ్5 కంపెనీలే కంట్రోల్ చేస్తున్నాయన్నారు.
గ్లోబల్‌గా వస్తువుల రేట్లు తగ్గాయ్..
సప్లయ్ చెయిన్ సమస్యలు తొలగిపోవడంతో గ్లోబల్‌గా ఇతర దేశాలలో వస్తువుల రేట్లు కిందకి దిగి వచ్చాయని, కానీ ఇండియాలో మాత్రం అలా జరగడం లేదని విరళ్ ఆచార్య వెల్లడించారు. కోర్ ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉండటం వల్లే బారోయింగ్ ఖర్చులు (వడ్డీ ) ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఇన్ఫ్లేషన్ వరసగా 17 నెలలపాటు 6 శాతం పైనే ఉంటోందని అన్నారు. పెద్ద కార్పొరేట్ల పవర్ దేశంలో ఎంతగా పెరిగితే, ఇన్ఫ్లేషన్ రిస్కులు అంత ఎక్కువవుతాయని ఆచార్య చెప్పారు. ఆర్బీఐకి స్వేచ్ఛ ఉండాలని చెబుతూ ఉంటారు. తన దగ్గర కూడా పూర్తి సొల్యూషన్స్ ఏవీ లేవంటూనే, చైనా తర్వాత శక్తివంతమైన ఎకానమీగా ఇండియా రాబోయే 10 ఏళ్లలో ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.