దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరణాలు నమోదైనట్లు అధికారికంగా గుర్తించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్నాటకలో ఒకరు.. హర్యానాలో ఒకరు ఇన్ ప్లూయెంజా వైరస్ బారిన పడి.. చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలో దాదాపు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు, ఎనిమిది హెచ్1ఎన్1 వైరస్ కేసులు కూడా నమోదయ్యాయని చెబుతున్నారు.
మరోవైపు..దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. "హాంకాంగ్ ఫ్లూ" అని కూడా పిలువబడే H3N2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు.
పంజా విసురుతోంది
డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గుండెల్ని మెలిపెట్టే భయంకరమైన వార్త వెలుగుచూసింది. నిన్నటి వరకూ కరోనా కల్లోలం కొనసాగితే.. ఇప్పుడు దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ పంజా విసురుతోంది. చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తూ.. భయపెడుతోంది. కరోనా కాటు నుంచి ఇంకా కోలుకోకముందే.. యావత్ ప్రపంచాన్ని మరో వైరస్ గజగజ వణికిస్తోంది.
దేశంలో ఇప్పుడు H3N2 వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకితే మొదటి మూడు రోజుల నుంచి 5 రోజులు పాటు జ్వరం వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చిన్నారులు, వృద్ధులకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని చెప్పారు.
రెండు మూడు నెలలుగా హెచ్ 3ఎన్2 దేశమంతటా విస్తృతంగా వ్యాపిలో ఉందని ఐసీఎంఆర్ కు చెందిన నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతరం దగ్గు రావడం, కొందరిలో శ్వాసకోశ సమస్యలు ముఖ్య లక్షణాలుగా పేర్కొంటు న్నారు.
ఇన్ఫ్లూయెంజా హెచ్ 3ఎన్2 వైరస్ అంటే..!
హెచ్ ఎన్2 వైరస్ అనేది ఇన్ఫ్లుయెంజా-ఏ ఉపరకం. వైరస్. ఇది శ్వాసకోస వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ 1968లో మనుషుల్లో బయటపడింది. ఈ వైరస్ హెబగ్లుటినిన్, న్యూరామి నిడేస్ ప్రోటీన్ జాతుల నుంచి బయట పడిందని వైద్యులు చెబుతున్నారు.
వైరస్ లక్షణాలు
జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు. కొవిడ్ తరహాలోనే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావారికీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. కానీ, జ్వరం, విరేచనాలు కూడా మొదలైతే మాత్రం వెంటనే డాక్టరును కలవాలి.
ఈ వైరస్ సోకితే రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మాస్క్ ధరించాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తుమ్మినా లేదా దగ్గినా వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీ నోటిని, ముక్కుని మాస్క్ కప్పుకోవడం మంచిది. వైద్యులు సూచించినట్లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే వైరస్ లను ఎదుర్కొనే వీలుంటుంది. గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.