ఇన్ఫోసిస్​కు దెబ్బ.. ఒక్క రోజులోనే 43,925 కోట్లు ఆవిరి

ఇన్ఫోసిస్​కు దెబ్బ.. ఒక్క రోజులోనే 43,925 కోట్లు ఆవిరి
  • ఆడిట్‌‌‌‌ కమిటీ చూస్తోంది   
  • స్వతంత్ర దర్యాప్తుకు లా సంస్థ నియామకం
  • స్టేక్‌‌‌‌ హోల్డర్ల హక్కులు కాపాడతాం    
  • రిపోర్టు రాగానే వెల్లడిస్తాం,ఇప్పుడింకేం మాట్లాడలేను   
  • నాన్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నందన్‌‌‌‌ నీలెకన్ని

ముంబై :

సీఈఓ, సీఎఫ్‌‌‌‌ఓలు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌‌‌‌లో 16 శాతం పతనమయ్యాయి. దీంతో రూ. 43,925 కోట్లు (6 బిలియన్‌‌‌‌ డాలర్లు) మార్కెట్‌‌‌‌ క్యాపిటలైజేషన్‌‌‌‌ ఒక్కసారిగా ఆవిరైపోయింది. మంగళవారం ఇన్ఫోసిస్‌‌‌‌ షేరు రూ. 645 కనిష్టానికి చేరింది.  గత ఆరేళ్లలో ఇన్ఫోసిస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ షేర్లు ఈ స్థాయిలో పతనమవడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఒక దశలో రూ. 638.30 ని ఈ షేర్‌‌‌‌ తాకింది. ఇన్ఫోసిస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ షేర్‌‌‌‌ శుక్రవారం రూ. 767.75 వద్ద ముగిసింది. అంతకు ముందు డిసెంబర్‌‌‌‌ 2018 లోనూ అప్పటి సీఈఓ విశాల్‌‌‌‌ సిక్కా పదవి నుంచి వైదొలగడంతో  ఇన్ఫోసిస్‌‌‌‌ షేరు ధర బాగా పడిపోయింది. సిక్కా, నారాయణ మూర్తిల మధ్య వివాదంతో షేర్‌‌‌‌ ధర రికవరీకి చాలా కాలమే పట్టింది. 2000 సంవత్సరం నుంచి చూస్తే ఒకే రోజు రెండంకెల స్థాయిలో ఇన్ఫోసిస్‌‌‌‌ షేరు ధర 16 సార్లు పతనమైంది.  ఇండియాలోని కంపెనీల వ్యాల్యుయేషన్స్‌‌‌‌లో కార్పొరేట్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌ పాత్ర  తక్కువేమీ కాదని, ఇన్ఫోసిస్‌‌‌‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని ఒక ఎనలిస్టు అభిప్రాయపడ్డారు.  ఇలాంటి పరిణామాలలో ఆడిటర్ల పాత్ర ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారిందని, వారిచ్చే రిపోర్టులు నిజమైన పనితీరును ప్రతిబింబించడం లేదనే ఆరోపణలూ వస్తున్నాయని ఆ ఎనలిస్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇన్ఫోసిస్​ షేర్ల అమ్మకానికి ఇన్వెస్టర్లు ఎగబడడంతో మంగళవారం సెన్సెక్స్​ 335 పాయింట్లు పతనమైంది. ఎక్కువ లాభం చూపడానికి ఖర్చులను తక్కువ చేశారని ఎథికల్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ పేరిట ఉద్యోగులు కొంత మంది ఇన్ఫోసిస్‌‌‌‌ బోర్డు, యూఎస్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈసీలకు ఫిర్యాదు చేశారు. ఇది సీరియస్‌‌‌‌ ఇష్యూనే. కార్పొరేట్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌ లోపాలను ఇది ఎత్తిచూపుతోంది. డిప్యూటీ సీఎఫ్‌‌‌‌ఓ కూడా రాజీనామా చేశారు. లోపల ఇంకా ఏదో తేడా ఉందనే దానికి ఇది ఆస్కారం కల్పిస్తోందని రిలయన్స్‌‌‌‌ సెక్యూరిటీస్‌‌‌‌ రిసెర్చ్‌‌‌‌ ఎనలిస్టు హరిత్‌‌‌‌ షా చెప్పారు. ఇన్ఫోసిస్‌‌‌‌ షేరు ధర స్వల్పకాలంలో  మరో 10–15 శాతం పతనమవొచ్చని అభిప్రాయపడ్డారు. బోర్డు దర్యాప్తు కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ఫోసిస్‌‌‌‌ షేర్లు చాలా మంది చేతుల్లో ఉన్నాయి. వారిలో కొందరైనా కొన్ని షేర్లను ఖచ్చితంగా అమ్ముతారని షా పేర్కొన్నారు.

క్లాస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ సూట్‌‌‌‌ ?

ఇన్ఫోసిస్‌‌‌‌ షేర్ల పతనంతో నష్టాలపాలైన ఇన్వెస్టర్ల నష్టాన్ని రికవరీ చేసేందుకు లా సంస్థ రాసెన్‌‌‌‌ క్లాస్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ లా సూట్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేసేందుకు సిద్ధమవుతోంది. సోమవారం ట్రేడింగ్లో న్యూయార్క్‌‌‌‌ స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌లో ఇన్ఫోసిస్‌‌‌‌ ఏడీఆర్‌‌‌‌లు 15 శాతం పతనమై 8.95 డాలర్లకు చేరాయి. మంగళవారం ఇండియా ఎక్స్చేంజ్‌‌‌‌లలోనూ ఇన్ఫీ షేర్లు పతనమయ్యాయి. మంగళవారం ఇన్ఫోసిస్‌‌‌‌ షేర్లు 16.21 శాతం నష్టంతో రూ. 643.30 వద్ద ముగిశాయి.  ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై కేసును దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాసెన్‌‌‌‌ సంస్థ వెల్లడించింది.

అకౌంట్లలో తేడాలున్నాయా ?

విజిల్‌‌ బ్లోయర్లు చెబుతున్నట్లుగా ఇన్ఫోసిస్‌‌ అకౌంట్స్‌‌లో నిజంగా తేడాలున్నాయా అనేది లోతుగా పరిశీలించాల్సిన విషయమే. ఇన్ఫోసిస్‌‌ క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ సందర్భంగా నిర్వహించే ఎనలిస్టుల కాన్ఫరెన్స్‌‌ కాల్స్‌‌లోని ఒక సంభాషణ ఆరోపణలకు మద్దతుగా నిలిచేట్లు కనిపిస్తోంది. అన్‌‌బిల్డ్‌‌ రెవెన్యూ భారీగా పెరిగింది. కంపెనీ అకౌంటింగ్‌‌ పాలసీలో ఏమైనా మార్పులున్నాయా ? అని ఒక ఎనలిస్టు ఈ కాన్ఫరెన్స్‌‌  కాల్‌‌లో మేనేజ్‌‌మెంట్‌‌ను ఆరా తీశారు. ఐతే, అకౌంటింగ్‌‌ పాలసీలలో మార్పులేవీ లేవని, కొంత మంది క్లయింట్ల కోరిక మేరకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందని మేనేజ్‌‌మెంట్‌‌ బదులిచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే ఇంక్రిమెంటల్‌‌ సేల్స్‌‌లో అన్‌‌బిల్డ్‌‌ రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏకంగా 24–25 శాతం పెరగడం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 10–11 శాతంగా ఉండేది.ఇదే అంశాన్ని ఆ ఎనలిస్టు కాన్ఫరెన్స్‌‌ కాల్‌‌లో ప్రస్తావించారు.అన్ని ఐటీ కంపెనీలలోనూ ఇలాగే అకౌంటింగ్‌‌ చేస్తారని, తామూ అదే  చేశామని ఇన్ఫోసిస్‌‌ ఉన్నతాధికారులు సమర్ధించుకున్నారు. అన్‌‌బిల్డ్‌‌ రెవెన్యూ భారీగా పెరగడంతో  విజిల్‌‌ బ్లోయర్స్‌‌ ఆరోపణలలో  ఎంతో కొంత నిజం ఉండొచ్చనడానికి కారణం దొరికినట్లవుతోంది.  అకౌంట్స్‌‌ రిసీవబుల్స్‌‌, అన్‌‌బిల్డ్‌‌ రెవెన్యూల పెరుగుదల ఫలితంగా క్యాష్‌‌ ఫ్లో తగ్గిపోతుంది. ఇన్ఫోసిస్‌‌ విషయంలో ఫ్రీ క్యాష్‌‌ ఫ్లో  స్థిరంగానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు క్వార్టర్లలో ఈ ఫ్రీ క్యాష్‌‌ ఫ్లో 79 శాతంగా ఉంది. ఆరోపణల్లో నిజముంటే ఆ ప్రభావం క్యాష్‌‌ ఫ్లోపై  కనబడి ఉండేదని ఒక ఎనలిస్ట్‌‌ వ్యాఖ్యానించారు.

ఇన్వెస్టర్ల హక్కులు రక్షిస్తాం… నీలెకన్ని

ఆరోపణలను ఆడిట్‌‌‌‌ కమిటీ ముందుంచామని ఇన్ఫోసిస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ నాన్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌ నందన్‌‌‌‌ నీలెకన్ని మంగళవారం స్టాక్ ఎక్స్చేంజ్‌‌‌‌లకు తెలిపారు. ఎథికల్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ చెబుతున్న ఈమెయిల్స్‌‌‌‌, వాయిస్‌‌‌‌ రికార్డులు ఏవీ తమకు చేరలేదని స్పష్టం చేశారు. ఈ ఆడిట్‌‌‌‌ కమిటీ విచారణకి సీఈఓ సలీల్‌‌‌‌ పరేఖ్‌‌‌‌, సీఎఫ్‌‌‌‌ఓ నీలాంజన్‌‌‌‌ రాయ్‌‌‌‌లు దూరంగా ఉంటారని, ఆడిట్‌‌‌‌ కమిటీ విచారణ సక్రమంగా సాగాలనే ఉద్దేశంతోనే వారు భాగం కాకుండా  చేశామని చెప్పారు. స్వతంత్ర విచారణ జరపాల్సిందిగా షార్దూల్‌‌‌‌ అమర్‌‌‌‌చంద్‌‌‌‌ మంగళ్‌‌‌‌దాస్‌‌‌‌ అండ్‌‌‌‌ కో (లా సంస్థ)ను ఇన్ఫోసిస్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ కమిటీ కోరింది. దర్యాప్తు పూర్తయ్యాక ఆడిట్‌‌‌‌ కమిటీతో చర్చించి, తదుపరి చర్యలను బోర్డు తీసుకుంటుందని కూడా నీలెకన్ని ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతున్న ఈ సమయంలో ఇంతకంటే మాట్లాడటం సాధ్యం కాదని పేర్కొన్నారు. తగిన సమయంలో దర్యాప్తు ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌లో ఉత్తమ ప్రమాణాలుండాలనే అంశానికి, అందరు స్టేక్‌‌‌‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకూ బోర్డు కట్టుబడి ఉందని కూడా నీలెకన్ని పేర్కొన్నారు.