గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ములుగు/ గూడూరు, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, యువతకు స్వయం ఉపాధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ములుగులోని కలెక్టరేట్​లో గిరిజనుల అభివృద్ధిపై కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్​తో సమావేశమై చర్చించారు. 

ఈ సందర్భంగా జిల్లాలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం తదితర సదుపాయాలపై ఆరా తీశారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ములుగు జిల్లాను అధికారుల సమన్వయంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక  ప్రణాళికలు రూపొందిస్తున్నమన్నారు. ఐటీడీఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 1936మంది యువతీ యువకులు ఉపాధి పొందారని తెలిపారు. అంతకుముందు జాకారం సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ కేంద్రాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ సందర్శించారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ మహేందర్ జీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మొదటిసారి ములుగుకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్​ సభ్యుడు జాటోతు హుస్సేన్ కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, గిరిజన మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్​తోపాటు ఇతర నాయకులు గట్టమ్మ వద్ద స్వాగతం పలుకగా, అమ్మవారికి హుస్సేన్ పూజలు చేశారు. మహబూబాబాద్​జిల్లా గూడూరు మండలం దామెర్​వంచ ట్రైబల్​ వెల్ఫేర్​ కళాశాల, గురుకుల పాఠశాల, బ్రాహ్మణపల్లి కస్తూర్బా గురుకుల పాఠశాలలను జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యుడు హుస్సేన్​సందర్శించారు.