
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామనారాయణ వివాదంపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం భద్రాచలం చేరుకుంది. ఈ కమిటీ మూడు రోజుల పాటు వివిధ వర్గాల నుంచి వివరాలు సేకరించనున్నది. హైకోర్టు ఆదేశాలు, షరతుల మేరకు మీడియాను అనుమతించలేదు. ఎండోమెంట్అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఈవో రమాదేవి ఈ కమిటీతో పాటు ఉన్నారు.
రంగనాయకుల గుట్టపై కాటేజీలో రామానారాయణ వివాదంపై ఆలయ అర్చకులు, అభ్యంతరం వ్యక్తం చేసే వారిని విడివిడిగా వీడియో తీస్తూ వివరాలు సేకరించారు. ఈ అంశంపై బహిరంగ ప్రదేశంలో చర్చ జరపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీతాదేవి గోత్రం గౌతమస, రాముడి గోత్రం వశిష్ట కాగా లక్ష్మీదేవి గోత్రం సౌభాగ్య, నారాయణుడి గోత్రం అచ్యుతలను అర్చకులు చదువుతున్నారని, ఇక్కడ సీతారాములకు బదులు లక్ష్మీదేవి, విష్ణుమూర్తిల గోత్రాలు ఎలా చదువుతారని వివాదం పుష్కర కాలంగా నడుస్తోంది. తారాస్థాయికి పోయి చివరకు కోర్టుకు చేరింది. మూడు రోజుల పాటు అందరినీ విచారించనున్న కమిటీ గోప్యతను పాటిస్తోంది. .