ఇండియన్​ నేవీలోకి ‘‘ఐఎన్​ఎస్ వాగీర్’’

ఇండియన్​ నేవీలోకి ‘‘ఐఎన్​ఎస్ వాగీర్’’

ముంబై: ఇండియన్​ నేవీలో కల్వరీ క్లాస్ సబ్​మెరైన్ ‘‘ఐఎన్​ఎస్ వాగీర్’’ చేరింది. దీంతో నావికాదళం మరింత పటిష్టమైంది. కల్వరీ క్లాస్​లో ఐదో సబ్​మెరైన్​గా వాగీర్​ సేవలు అందించనుంది. మజ్​గావ్ డాక్​ షిప్ యార్డ్​ లిమిటెడ్ కంపెనీ దీన్ని ముంబైలో తయారు చేసింది. ఫ్రాన్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ సబ్​ మెరైన్​ ఇండియన్​ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ సమక్షంలో సోమవారం డ్యూటీ ఎక్కింది. ఈ సందర్భంగా హరికుమార్ మాట్లాడారు. వాగీర్ రాకతో సముద్ర జలాల్లో భద్రత మరింత పెరిగిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో శత్రువులను దెబ్బతీసేందుకు, ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్, నిఘా కోసం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాజెక్ట్​ 75 కింద దీన్ని నిర్మించామని, దేశ ప్రయోజనాలను కాపాడుతుందని అభిప్రాయపడ్డారు. వాగీర్ అంటే సొర చేప అని, నిశ్శబ్దంగా, భయం లేకుండా పని ముగించడం దీని ప్రత్యేకత అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఆయుధాలు కలిగి ఉంటుందన్నారు.

సౌండ్​ అబ్సార్​ప్షన్​ టెక్నిక్​తో సేవలు

వాగీర్ సీ ట్రయల్స్ 2022 ఫిబ్రవరి నుంచి ప్రారంభించామని, డిసెంబర్​ 20న నేవీ చేతికి అందించామని ఎండీఎల్ చైర్మన్, ఎండీ నారాయణ్​ ప్రసాద్​ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయని, ఈ టైంలో వాగీర్ ఇండియన్ నేవీలో చేరడం మరింత వేడి పుట్టిస్తుందన్నారు. శత్రువుల రాడార్​కు చిక్కకుండా సౌండ్ అబ్సార్​ప్షన్  టెక్నిక్​తో ఈ సబ్​మెరైన్​ పని చేస్తుందన్నారు.

సబ్​మెరైన్​ ప్రత్యేకతలు..

  •     అతిపెద్ద నౌకలను ధ్వంసం చేసే వైర్-గైడెడ్ టార్పెడోలు ఇందు​లో ఉన్నాయి.
  •     వాగీర్​ నుంచి సబ్‌‌ సర్ఫేస్‌‌ టూ సర్ఫేస్‌‌ మిసైల్స్​ ప్రయోగించవచ్చు.
  •     పవర్​ఫుల్​ డీజిల్​ ఇంజిన్​ను అమర్చారు. ఇవి స్టెల్త్​ మిషన్​ కోసం బ్యాటరీలను తక్కువ టైంలో ఫుల్ చార్జ్​ చేస్తాయి. 
  •     సెల్ఫ్ ప్రొటెక్షన్​ కోసం అత్యాధునిక టార్పెడో డికాయ్ సిస్టమ్‌‌ ఉంది.
  •     సముద్రం మధ్యలో, ఒడ్డుకు దగ్గర్లో కూడా వాగీర్​ను మోహరించవచ్చు.
  •     హైడ్రో డైనమిక్​ రూపానికి అనుకూలంగా దీన్ని తయారు చేశారు. 
  •     యాంటీ సర్ఫేస్​ వార్, యాంటీ సబ్ మెరైన్ వార్, మైన్స్ పెట్టడం, నిఘా పెట్టడం వాగీర్ ప్రత్యేకత.
  •     నీటి లోపల గంటకు 40 కి.మీ. నీటిపైన గంటకు 20 కి.మీ స్పీడ్​తో వెళ్తుంది.
  •     221 అడుగుల పొడవు, 21 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.