Rishab Shetty: రిషబ్ శెట్టి 'కాంతార' మ్యాన్షన్: ఇంట్లో ఏడు సెకన్లు నిలబడితే 'భూతకోల' వైబ్రేషన్స్!

Rishab Shetty: రిషబ్ శెట్టి 'కాంతార' మ్యాన్షన్: ఇంట్లో ఏడు సెకన్లు నిలబడితే 'భూతకోల' వైబ్రేషన్స్!

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 'కాంతర 'మూవీతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.  లేటెస్ట్ గా రిషబ్ నటించి, రూపొందించిన  పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' అక్టోబర్ 2, 2025న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మూవీలను సైతం బోల్తా కొట్టించి దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఊపులో ఉన్న రిషబ్ శెట్టి స్వస్థలం ఉడిపిలోని కుందాపూర్ లో ఉన్న ఆయన విలాసవంతమైన ఇల్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

కొత్త అనుభూతి ఇచ్చేలా .. 

సంస్కృతి, కళ, సినిమా పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తూ రిషబ్ శెట్టి తన నివాసాన్ని నిర్మించుకున్నారు. సుమారు రూ.12 కోట్లు విలువ చేసే ఈ భవనం ఆయన ముత్తాతల నుంచి వచ్చిన స్థలంలోనే కట్టారు. ఇది కేవలం ఇల్లు కాకుండా..  మ్యూజియంను తలపించేలా ఒక కొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చక్కటి వాస్తులో నిర్మించారు. ఈ ఇంటి భద్రత కోసం ఫేషియల్-రికగ్నిషన్ కెమెరాలు , 'యక్ష' అనే రిటైర్డ్ కోస్టల్ పోలీస్ డాగ్ కాపలాగా ఉంటుంది.

సాంస్కృతిక వైభవంతో.... 

ఈ ఇంటి ప్రధాన ద్వారం బ్రాస్ స్టడ్డెడ్ బర్మా టేకు కలపతో తయారైంది. అతిథులు డోర్ బెల్ కొట్టడానికి బదులుగా, చేతితో లాగే ఆలయ గంటను ఉపయోగిస్తారు. అంతేకాదు  ఇంటి లోపల దాదాపు 300 కిలోల గ్రానైట్‌తో చేసిన భారీ తులసి కట్ట ఏర్పాటు చేశారు.  ఇంటి ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన నల్లరాయి ఉంది. ఆ రాయిపై ఏదైనా సందర్శకుడు ఏడు సెకన్ల పాటు నిలబడితే చాలు.. ఒక్కసారిగా ఇంట్లో 'భూత కోల' సినిమా సన్నివేశంలోని దైవత్వం నిండిన శబ్దాలు మార్మోగుతాయి. ఇది రిషబ్‌కు అత్యంత ఇష్టమైనది.

 

జ్ఞాపకాల గ్యాలరీ

ఇంట్లో ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక ర్యాక్స్‌లో రిషబ్ శెట్టి జ్ఞాపకాలను భద్రపరిచారు. వీటిలో యక్షగానం తలపాగాలు, యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్, అలాగే 'కాంతార' సినిమాలో ఉపయోగించిన రైఫిల్ ప్రాప్ కూడా ఉన్నాయి.  సాంస్కృతిక వారసత్వం, ఆధునిక విలాసాన్ని మేళవించిన ఈ నివాసం, రిషబ్ శెట్టి వ్యక్తిత్వాన్ని, విజయగాథను ప్రతిబింబిస్తుంది..

ప్రైవేట్ థియేటర్..

సినిమాకు సంబంధించిన వ్యక్తి కావడంతో, వినోదానికి ఈ ఇంట్లో పెద్ద పీట వేశారు . ఇటాలియన్ లెదర్ రెక్లైనర్లు, 150-అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్‌తో కూడిన అత్యాధునిక ప్రైవేట్ థియేటర్ కూడా ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. మంగళూరు పెంకులతో చేసిన షాన్డిలియర్. ఇది గదికి వెచ్చని ఎరుపు రంగు కాంతిని అందిస్తుంది. ఇక్కడి ప్రొజెక్టర్‌కు రిషబ్ శెట్టి ముద్దుగా కాంతారలోని రక్షక అటవీ దేవత పేరు 'సేలేరాయ' అని పేరు పెట్టారు.

ప్రత్యేక వంటగది.. పెద్ద లైబ్రరీ.. 

ఇక వంటగది కౌంటర్ మెరిసే నల్లరాతితో చేయబడింది. ఆదివారం చేసుకునే సంప్రదాయ కోరి గస్సీ కోసం దీన్ని ఇంట్లో చేసిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారు. అంతే కాదు రిషబ్ ఇంట్లో పెద్ద లైబ్రరీ కూడా ఉంది. లోఫ్ట్ ఏరియాలో జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ నవలల వరకు 1,200కు పైగా పుస్తకాలు ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంటి వైఫై పాస్‌వర్డ్ ప్రతి నెలా మారుతుంది. అది కూడా 'కాంతార' సినిమాలోని ఒక కొత్త డైలాగ్‌తో! 

పాన్-ఇండియా రికార్డుల మోత

బాక్సాఫీస్ వద్ద 'భూతకోల' సృష్టిస్తున్న విజృంభణ అంతా ఇంతా కాదు. రిలీజైన మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు అంచనాలకు మించిపోయాయి. దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి సృష్టించిన ఈ దృశ్య కావ్యం, ప్రేక్షకుల గుండెల్లో దైవత్వాన్ని, ఉద్వేగాన్ని నింపుతూ దూసుకుపోతోంది. సినీ ట్రెడ్ విశ్లేషణ సంస్థ సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్‌ రికార్డుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా తన సత్తాను కొనసాగిస్తోంది.