ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
  • ఇంకా పూర్తికాని ఏఐసీటీఈ వెరిఫికేషన్ 
  • 19 నుంచి జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో ఎఫ్ఎఫ్​సీ చెకింగ్​ 
  • రోజూ 15–20 కాలేజీల్లో విజిటింగ్స్ 
  • వీసీ పదవీకాలం ముగుస్తున్నందుకే హడావుడి అన్న విమర్శలు  

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు పలు ప్రొఫెషనల్ కాలేజీలకు అఫిలియేషన్ విషయంలో జేఎన్టీయూ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల19 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కాలేజీల్లో ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ(ఎఫ్ఎఫ్​సీ)లు తనిఖీలు చేయనున్నట్టు వర్సిటీ ప్రకటించింది. అయితే, ఇంకా ఏఐసీటీఈ నుంచి కాలేజీలకు అనుమతులు రాకముందే, తనిఖీలు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ వీసీ పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్నందునే ఇలా హడావుడిగా చెకింగ్స్ చేస్తున్నారని, ఇదేం తీరు అని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో జేఎన్టీయూకు అనుబంధంగా 220 దాకా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. వీటికీ ఏటా ఏఐసీటీఈ ఆన్​లైన్  వెరిఫికేషన్​తో పాటు జేఎన్టీయూ ద్వారా తనిఖీలు నిర్వహించి కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు.

ఆన్ లైన్ వెరిఫికేషన్ పూర్తయ్యాక కొత్త కోర్సులు, సీట్ల పెంపుపై ఏఐసీటీఈ ప్రకటన చేస్తుంది. తర్వాత జేఎన్టీయూ ఆయా కాలేజీలను మరోసారి తనిఖీలు చేసి, కాలేజీలకు గుర్తింపుతో పాటు సీట్ల పెంపు, కొత్త కోర్సులను ఫైనల్ చేసి సర్కారుకు రిపోర్ట్ పంపిస్తుంది. దాని ఆధారంగా సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. కానీ, 2024–25 ఏడాదికి మాత్రం ఏఐసీటీఈ తనిఖీలు పూర్తికాకముందే జేఎన్టీయూ హడావుడి చేస్తోంది. గతంలోనే ఫిబ్రవరి17 నుంచి ఎఫ్ఎఫ్ సీ తనిఖీలు చేయాలని ఆదేశాలివ్వగా, దీనిపై విమర్శల నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో ఆపేశారు. మళ్లీ ఈ నెల19 నుంచి ఎఫ్ఎఫ్​సీ తనిఖీలు ప్రారంభించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. రోజూ15 నుంచి 20 కాలేజీల్లో తనిఖీలు చేసి, 20 రోజుల్లోనే ఈ ప్రక్రియంతా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.  

కొత్త కోర్సులు, సీట్లపై క్లారిటీ రాకున్నా..  

ఎఫ్ఎఫ్​సీ తనిఖీల సందర్భంగా టీచింగ్ ఫ్యాకల్టీ వివరాలు, వారి క్వాలిఫికేషన్,​ జీతాలు, ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్స్ ఇలా అన్నింటినీ పరిశీలించిన తర్వాతే రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ నుంచి ఇంకా కొత్త కోర్సులు, సెక్షన్లు, సీట్ల పెంపుపై క్లారిటీ రాలేదు. కోర్సులు,సెక్షన్లకు అనుగుణంగా వసతులు, ఫ్యాకల్టీ ఉండాల్సి ఉంటుంది. కానీ, అవేవీ లేకుండా ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ ను ఎలా ఫైనల్ చేస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్, దాని రిలేటెడ్ కోర్సుల్లో సీట్ల పెంపునకు, ఇతర కొన్ని కోర్సులకు చాలా కాలేజీలు ఏఐసీటీఈకి ప్రపోజల్స్ పెట్టుకున్నాయి. వాటిల్లో ఎలా తనిఖీలు చేస్తారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీసీ పదవీకాలం వచ్చే నెలలో ముగుస్తున్నందుకే ఈ హడావుడి తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.