ఇన్​స్పిరేషన్ : పారాచూట్‌‌ మన దేశపు నమ్మకం

ఇన్​స్పిరేషన్ : పారాచూట్‌‌ మన దేశపు నమ్మకం

గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన బ్రాండ్ పారాచూట్‌‌‌‌. అందుకే ఒకప్పుడు చాలామంది తల్లులు పిల్లలకు హెయిర్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తీసుకురమ్మని చెప్పడానికి బదులు పారాచూట్ తీసుకురమ్మని చెప్పేవాళ్లు. ఎన్ని ఏండ్లు గడిచినా ఈ బ్రాండ్‌‌‌‌కు వాల్యూ తగ్గడంలేదు.

ఇప్పుడంతా కిలోల లెక్క. కానీ.. ఇదివరకు మన దగ్గర బియ్యాన్ని తవ్వల్లో, అడ్డాల్లో కొలిచేవాళ్లు. కొలత కోసం ప్రత్యేకంగా డబ్బాలను తయారు చేయించుకునేవాళ్లు. అదే బిహార్‌‌‌‌‌‌‌‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పారాచూట్‌‌‌‌ డబ్బాలతో బియ్యం, ధాన్యాన్ని కొలిచేవాళ్లు. అవును.. ఆ ప్రాంతంలో ‘చౌర్ నాపనా’ అనే కొలత ఉండేది. దాని కోసం పారాచూట్ హెయిర్ ఆయిల్ టిన్‌‌‌‌లు వాడేవాళ్లు. ఆయిల్‌‌‌‌ ఎంత క్వాలిటీగా ఉంటుందో ఆ డబ్బా కూడా అంతే క్వాలిటీగా ఉండేది. అందుకే ఈ డబ్బాలు గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనిపించేవి. ఆ తర్వాత టిన్ డబ్బాలకు బదులు ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్లను తీసుకొచ్చినా పారాచూట్‌‌‌‌ బ్రాండ్​కి డిమాండ్‌‌‌‌ మాత్రం తగ్గలేదు. 

ఇలా మొదలైంది

పారాచూట్ కొబ్బరి నూనె తయారు చేస్తున్న కంపెనీకి1862లోనే పునాదులు పడ్డాయి. గుజరాత్‌‌‌‌ లోని కచ్‌‌‌‌కి చెందిన కంచి మొరార్జీ ముంబైలో చిన్నగా ఆయిల్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన మేనల్లుడు వల్లభదాస్‌‌‌‌ను అందులో పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌గా చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ కంపెనీ కేరళలోకి అడుగుపెట్టింది. కేరళకే ఎందుకంటే అప్పట్లో సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా పసుపు, ఎండుమిర్చి, అల్లం, ఎండు  కొబ్బరి లాంటివి అక్కడే బాగా దొరికేవి. 

వాటిని కొనుక్కొని ముంబైకి తెచ్చుకునేవాళ్లు మొరార్జీ, వల్లభ్​దాస్​లు. అక్కడి నుంచి ఢిల్లీ, అమృత్‌‌‌‌సర్, కోల్‌‌‌‌కతాకు రైళ్ల ద్వారా సరఫరా చేసేవాళ్లు. అలా కొన్నాళ్లకు కేరళలో మసాలా ట్రేడింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ని పెట్టారు. ఆ తర్వాత అలెప్పిలో పెప్పర్ ప్రాసెసింగ్ యూనిట్‌‌‌‌ మొదలుపెట్టారు. ఆ బిజినెస్‌‌‌‌ ఫుల్ సక్సెస్‌‌‌‌ అయ్యింది. అందుకే  వల్లభదాస్‌‌‌‌ పేరుకు ముందు నల్లమిరియాలు యాడ్‌‌‌‌ అయ్యాయి. గుజరాతీలో ‘మారి’ అంటే ‘నల్ల మిరియాలు’.వల్లభ దాస్‌‌‌‌ ఈ వ్యాపారంలో ఆరితేరడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అందరూ ఆయన్ని ‘మారివాలా వల్లభదాస్‌‌‌‌’ అని పిలిచేవాళ్లు. అలా వ్యాపారం పెరుగుతూ వచ్చింది. 

తర్వాత వల్లభదాస్​ కొడుకులు1948లో ‘ముంబై ఆయిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌‌‌’ స్థాపించారు. ఇరవై ఏండ్లు గడిచేసరికి ముంబైలో మూడు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. తర్వాత కేరళలో ఓ కంపెనీ పెట్టారు. అక్కడ కొబ్బరినూనె, వెజిటబుల్ ఆయిల్, కెమికల్స్ తయారు చేసేవాళ్లు. అలా కొబ్బరి నూనె ప్రొడక్షన్​ మొదలైంది. ఆ ప్రయాణం ఈనాటికీ పారాచూట్‌‌‌‌ రూపంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కంపెనీ పేరు ‘మారికో ఇండస్ట్రీస్ లిమిటెడ్’గా మారింది.

నెంబర్ వన్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌

కేరళలో ప్రతి ఇంట్లో వాడే శుద్ధమైన కొబ్బరి నూనెనే మారికో కంపెనీ దేశానికి అందించింది. అందుకే చాలా తక్కువ టైంలోనే అమ్మకాలు పెరిగాయి. దేశంలో నెంబర్ వన్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌గా నిలిచింది. కొన్నేండ్లకు కొబ్బరినూనెకు మరోపేరుగా మారింది పారాచూట్. 1990ల్లో బంగ్లాదేశ్‌‌‌‌లో కూడా కొబ్బరినూనె తయారీ కర్మాగారాన్ని మొదలుపెట్టారు. అక్కడ కూడా అమ్మకాలు బాగానే జరిగాయి.

పారాచూట్ రెండు రకాల ఆయిల్స్‌‌‌‌ని అమ్ముతోంది. మొదటిది వంటనూనె. ఇందులో 100% కొబ్బరి నూనె. రెండోది హెయిర్ ఆయిల్‌‌‌‌.. ఇందులో కొబ్బరి నూనెతో పాటు 50% మినరల్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్స్‌‌‌‌ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చే ముందు వాటిపై ఆరేండ్లపాటు ఇంటెన్సివ్ రీసెర్చ్ చేశామని చెప్పింది కంపెనీ. మారికో కంపెనీ పారాచూట్‌‌‌‌తోపాటు సఫోలా లాంటి వంటనూనెను కూడా తయారు చేస్తోంది. అంతేకాదు.. మారికో హెయిర్ అండ్‌‌‌‌  కేర్, సెట్​ వెట్, రివైవ్​ అంటూ పలురకాల ప్రొడక్ట్స్‌‌‌‌ అమ్ముతోంది. 

హర్ష్ మారివాలా

తన తాత పెట్టిన బిజినెస్‌‌‌‌ను అంచెలంచెలుగా డెవలప్‌‌‌‌ చేస్తూ... నలభై ఏండ్ల వయసులో మారికోను ప్రారంభించాడు గుజరాతీ వ్యాపార దిగ్గజం హర్ష్ మారివాలా. హర్ష్  మారివాలా మారికోను పెట్టినప్పుడు మల్టీ నేషనల్‌‌‌‌ కంపెనీల పోటీ ఉండని ప్రొడక్ట్స్‌‌‌‌ ఉత్పత్తి చేయాలి అనుకున్నాడు. అప్పుడు ఆయనకు హెయిర్ ఆయిల్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే.. కొన్ని దేశాల వాళ్లకు హెయిర్ ఆయిల్‌‌‌‌ అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే హర్ష్ తన కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీయులతో మాట్లాడినప్పుడు వాళ్లు కూడా ‘‘హెయిర్ ఆయిల్ అంటే ఏంటి?” అని అడిగారు. 

‘హెయిర్ ఆయిల్‌‌‌‌ ఏ దేశంలో వాడకపోయినా ఇండియాలో మాత్రం వాడడం ఆపరు’ అని హర్ష్‌‌‌‌ గట్టిగా నమ్మాడు. అందుకే ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. ఆయన కంపెనీ పెట్టినప్పుడు ఇండియాలో  అంత పోటీ లేదు. అందుకే తక్కువ టైంలో సక్సెస్‌‌‌‌ అయ్యింది. పారాచూట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లోకి వచ్చాక జుట్టుకు నూనె రాసే ట్రెండ్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేకాదు.. కంపెనీని డెవలప్‌‌‌‌ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయన పడిన కష్టం ఫలితమే పారాచూట్‌‌‌‌ సాధించిన సక్సెస్‌‌‌‌. ఇప్పుడు ఇండియాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు పారాచూట్, సఫోలా, నిహార్, కాయా, మెడికేర్ లాంటి మారికో ప్రొడక్ట్స్‌‌‌‌ వాడుతున్నారు. అంతెందుకు బంగ్లాదేశ్​ హెయిర్ ఆయిల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో 80% మార్కెట్ వాటా పారాచూట్‌‌‌‌దే! 

కేరళలో ఫ్యాక్టరీ

నిజానికి హర్ష్ మారివాలా దేశంలోని ఏ మూలన అయినా కొబ్బరి నూనె కోసం యూనిట్స్​మొదలుపెట్టొచ్చు. కానీ..  ఆయన మాత్రం గుజరాత్, గోవా, పాండిచ్చేరి, కేరళలను మాత్రమే సెలక్ట్‌‌‌‌ చేసుకున్నాడు. ముంబై ఆయిల్ ఇండస్ట్రీస్ నడుస్తున్న టైంలో కూడా వాళ్ల కంపెనీకి కేరళ నుంచే కొబ్బరి వచ్చేది. దేశంలోని కొబ్బరిలో మూడింట రెండు వంతులు కేరళ రాష్ట్రంలోనే పండుతుంది. అందుకే కేరళలో పెద్ద ఫ్యాక్టరీ పెడితే.. ట్రక్కుల రాకపోకలను తగ్గించి డబ్బు ఆదా చేసుకోవచ్చు అనేది హర్ష్‌‌‌‌ ఆలోచన. ఆ ఆలోచన వల్లే తక్కువ ఖర్చుతో పారాచూట్‌‌‌‌ని తీసుకురాగలిగాడు. అప్పటి కేరళ ప్రభుత్వం కూడా సబ్సిడీకి భూమి, చౌకగా కరెంటు ఇచ్చింది. 

మొదట్లో టిన్‌‌‌‌

హర్ష్ మారివాలా వ్యాపారంలోకి వచ్చిన కొత్తలో టిన్ డబ్బాల్లో కొబ్బరి నూనె అమ్మేవాళ్లు. ప్లాస్టిక్ లాభాలను తెలుసుకున్న తర్వాత టిన్‌‌‌‌కు బదులు ప్లాస్టిక్‌‌‌‌ డబ్బాలో కొబ్బరి నూనె తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ బాటిల్‌‌‌‌ అయితే చౌకగా దొరుకుతుంది.షెల్ఫ్‌‌‌‌లో ఉంచడం కూడా ఈజీ. అయితే కంపెనీ చేసిన రీసెర్చ్‌‌‌‌లో కొబ్బరి నూనె కోసం ప్లాస్టిక్ బాటిల్ వాడడం కరెక్ట్‌‌‌‌ కాదని తేలింది. మారికో కంటే సుమారు పదేండ్ల ముందు ఓ కంపెనీ కొబ్బరి నూనెను చతురస్రాకారపు ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్లలో తెచ్చింది. 

ఆ డబ్బాలు షాపుల్లో పెడితే వాటిని ఎలుకలు కొరికేవి. దాంతో చాలా నష్టం వచ్చేది. అందుకే షాపుల వాళ్లు ఆ బ్రాండ్‌‌‌‌ని అమ్మడం, కొనడం తగ్గించారు. అదే టిన్‌‌‌‌లు అయితే వాటిని కొరకడం ఎలుకలకు అంత ఈజీ కాదు. మరయితే ప్లాస్టిక్​ బాటిల్​ వాడడం కుదరదా అని ఆలోచించిన పారాచూట్‌‌‌‌ కంపెనీకి కొన్నాళ్లకు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. చదరంగా ఉండే పెట్టెలో కాకుండా గుండ్రని ఆకారంలో ఉన్న బాటిల్‌‌‌‌లో కొబ్బరి నూనె నింపింది.  బాటిల్​ గుండ్రంగా ఉండడం వల్ల ఎలుకల పళ్లకు బాటిల్​ కొరికే పట్టు చిక్కదు. కాబట్టి బాటిల్​ కొరకడం కష్టం. ఈ ఆలోచనతో అప్పటినుంచి గుండ్రని డబ్బాల్లో చుక్క నూనె కూడా లీక్‌‌‌‌ కాకుండా ప్యాక్ చేశారు. 

కానీ.. ఇలా టిన్‌‌‌‌ నుంచి ప్లాస్టిక్‌‌‌‌కు మారడానికి దాదాపు పదేండ్లు పట్టింది. అంత సమయం పట్టడానికి కారణం... దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టెస్ట్‌‌‌‌లు కూడా చేశారు. దాదాపు ఎనిమిది నుంచి పది బాటిళ్లను, కొన్ని ఎలుకలను కలిపి కొన్ని రోజులు బోనుల్లో ఉంచేవాళ్లు. అప్పుడు ఎలుకలు బాటిల్స్​పాడు చేయలేదు. ఇదంతా బాగానే ఉంది కానీ, దుకాణదారులకు నమ్మకం కలిగించడం కాస్త కష్టమైంది. అప్పటివరకు ప్లాస్టిక్‌‌‌‌ బాటిళ్ల వల్ల వాళ్లకి ఎదురైన అనుభవం వల్ల వాళ్లు ప్లాస్టిక్​ బాటిల్స్​ను తీసుకునేందుకు ఒప్పుకోలేదు. 

చివరకి ప్రాక్టికల్​గా వాళ్లు చేసిన ప్రయోగం తాలూకా ఫొటోలను వాళ్లకు చూపించి, ఒప్పించగలిగారు. ‘‘ముందుగా మూడు నుండి ఆరు బాటిళ్లు తీసుకుని టెస్ట్‌‌‌‌ చేయండి. తర్వాతే ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి’’  అని షాపుల వాళ్లకు చెప్పేవాళ్లు. అలా చివరకు ప్లాస్టిక్ బాటిళ్లకు మారారు. టిన్‌‌‌‌లలో కొబ్బరినూనె నింపడం ఆపడంతో ఖర్చు తగ్గింది. తగ్గిన ఖర్చుతో కొత్త అడ్వర్టైజ్​మెంట్స్​ చేసింది. 

కాపీ కొట్టేవాళ్లు

అంతా బాగానే ఉందనుకుంటుంటే కంపెనీకి మరో సమస్య వచ్చిపడింది. పారాచూట్‌‌‌‌ బాటిళ్లలాంటి వాటిని తయారుచేసి వాటిలో వాళ్ల నూనె పోసి అమ్ముకునేవాళ్లు. దాంతో కంపెనీ అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గిపోయాయి. ఏంచేస్తే ఈ నకిలీ బాధ నుంచి తప్పించుకోవచ్చా అని ఆలోచించారు. అప్పుడు బాటిల్స్​ మీద ఒక కొబ్బరిచెట్టు, కొబ్బరి చిప్పలతో ఒక అచ్చు తయారుచేయించింది కంపెనీ. ఇక అప్పటి నుంచి ఆ బాటిల్స్​ను కాపీ చేయడం ఆగిపోయింది. 

హెయిర్ ఆయిల్ అని ఉండదు

పారాచూట్ కొబ్బరి నూనె డబ్బాపై హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. 100% స్వచ్ఛమైన కొబ్బరి నూనె అనే రాసి ఉంటుంది. దానికి కారణం.. ఇండియాలో దాదాపు 50 కోట్ల మధ్య, దిగువ తరగతి ప్రజలు చలికాలంలో పారాచూట్ ఆయిల్‌‌‌‌ను మాయిశ్చరైజర్ ఆయిల్‌‌‌‌గా కూడా వాడతారు. అందుకే డబ్బాపై హెయిర్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌ అని ప్రింట్‌‌‌‌ చేయరు. 

కొన్ని నివేదికలు మాత్రం ‘కంపెనీ ప్యాకెట్‌‌‌‌పై హెయిర్ ఆయిల్‌‌‌‌ అని ప్రింట్ చేస్తే దాని ధరపై ఎనిమిది శాతం ఎక్సైజ్ ట్యాక్స్ పెరుగుతుంది. అందుకే కంపెనీ అలా రాయదు’ అని చెప్తున్నాయి. ఇప్పుడు పారాచూట్‌‌‌‌ మన దేశంలోనే కాదు..  ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, మిడిల్ ఈస్ట్, వియత్నాం, బంగ్లాదేశ్, మలేసియా వంటి దేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించింది. 


ఆ పేరు ఎందుకు?

రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు మొదటిసారిగా పారాచూట్‌‌లను ఎక్స్​పీరియెన్స్ చేశారు. అప్పుడు ఆర్మీ సిబ్బంది పారాచూట్‌‌లను సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. కానీ.. జనాలకు వాటి మీద నమ్మకం ఉండేది కాదు. ఆర్మీ వాళ్లు వాడాక సేఫ్‌‌ అని నమ్మారు. అదే టైంలో మార్కెట్‌‌లోకి వచ్చిన ఈ ఆయిల్‌‌కు ‘హర్ష్‌‌ పారాచూట్‌‌’ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టాక చాలాంది హర్ష్​కు బ్రాండ్ పేరు మార్చమన్నారు. కానీ.. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.