ఒక్క ఐడియా హోటల్నే మార్చేసింది...

ఒక్క ఐడియా హోటల్నే  మార్చేసింది...

ఒక ఐడియా ఓ జీవితాన్నే మారుస్తుందంటారు. ఇది సరదాగా చెప్పుకునే డైలాగ్ అయినా..కొన్ని క్లిష్ట సమయాల్లో ఒక్క ఐడియాన్ని జీవితాన్ని నిలబెడుతుంది. అయితే విశాఖ పట్నంలో ఒక్క ఐడియా మాత్రం ఓ హోటల్ యజమానికి   డబ్బులను ఆదా చేసింది. అవును..చిన్న ఐడియా అతని వ్యాపారానికి సరికొత్త మెరుపులు అద్దడంతో పాటు..డబ్బులను సేవ్ చేసింది. 

వైజాగ్లో గురుద్వారా జంక్షన్లో ఓ హోటల్ ఉంది. ఇది ఐదంతుస్తుల హోటల్.  అయితే ఒకప్పుడు మామూలుగా ఉండే ఈ హోటల్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే. ప్రస్తుతం కరెంట్ బిల్లులు మామూలుగా ఉండటం లేదు. నెలతిరిగే సరికి వచ్చే విద్యుత్ బిల్లులతో దిమ్మతిరిగిపోతుంది. అయితే ఈ హోటల్ యజమాని కూడా కరెంట్ బిల్లులతో విసిగిపోయాడు. వేలల్లో విద్యుత్ ఛార్జీలు రావడంతో ..శాశ్వత పరిష్కారం ఆలోచించాడు. అంతే అతనికి ఓ విభిన్న ఆలోచన వచ్చింది. విద్యుత్కు ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచన ప్రకారం  భవనం అంతటా సోలార్ ప్యానెళ్లు బిగించాడు. భవనం లోపల, వెలుపల సోలార్ పలకలను ఏర్పాటు చేయించాడు. 

హోటల్ ఐదు అంతస్తుల భవనానికి మొదటి అంతస్తు నుంచి చివరవరకు సోలార్ ప్యానెల్స్ లనే అలంకరణగా ఉపయోగించారు. వీటి ద్వారా రోజుకు 78 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఒకప్పుడు కరెంట్ బిల్లులు అధికంగా వచ్చిన ఈ హోటల్ కు ఇప్పుడు సోలార్ పలకలను అమర్చడం ద్వారా..కరెంట్ మిగులుతుంది. దీంతో నెట్ మీటరింగ్ ద్వారా మిగిలిపోయిన కరెంట్ గ్రిడ్ కు విక్రయించి..ఆదాయం పొందాలని కూడా యజమాని చూస్తున్నాడు.  మామూలుగా ఎలివేషన్ కు నలుపు రంగు అద్దాలను ఉపయోగిస్తారు. అయితే  వాటికి బదులు సోలార్ ప్యానళ్లను ఉపయోగించడం ద్వారా కొద్దిగా ఖర్చు ఎక్కువైంది. అయితే హోటల్కు మాత్రం కొత్తదనం వచ్చింది. దీనికి తోడు హోటల్కు పబ్లిసిటీ బాగా వచ్చింది. స్థానికులు  హోటల్ పేరు కంటే..సోలార్ హోటల్గానే ఎక్కువగా గుర్తుపడుతున్నారు.