
- అవిశ్వాసం పెట్టేందుకు గడువును నాలుగేండ్లకు పెంచామంటూ మెసేజ్
- చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఆర్డర్స్
- ఇప్పటికే 20 చోట్ల నో కాన్ఫిడెన్స్ మోషన్‌కు బీఆర్ఎస్ లీడర్ల ప్రయత్నాలు
- ఎన్నికల ముందు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా గ్రూపు రాజకీయాలు
జగిత్యాల/నెట్వర్క్, వెలుగు: ఎన్నికల ముందు తమ అనుచరులను బల్దియా పీఠాలపై కూర్చోబెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దాదాపు 20 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కే చెందిన మేయర్లు, చైర్పర్సన్లను గద్దె దింపేందుకు అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ చట్టం ప్రకారం పాలకవర్గాలు మూడేండ్లు పూర్తి చేసుకున్న చోట అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ గడువును నాలుగేండ్లకు పెంచుతూ చట్టానికి సవరణ చేసింది. ఈ బిల్లుకు అసెంబ్లీ, కౌన్సిల్లో ఆమోదం తెలిపి.. పోయినేడాది సెప్టెంబర్‌లో గవర్నర్పరిశీలనకు పంపింది.
కానీ గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో చట్టంగా మారలేదు. దీంతో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల కోసం సీక్రెట్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనగామలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇక జగిత్యాల బల్దియా చైర్పర్సన్ బోగ శ్రావణిపై అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలంటూ పలువురు కౌన్సిలర్లు ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అయితే జగిత్యాలలో అనుమతిస్తే మరిన్ని చోట్ల ఇదే పరిస్థితి తలెత్తుతుందని, ఎన్నికల ముందు ఈ తేనెతుట్టెను కదిపితే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన కేటీఆర్.. బల్దియాల్లో అవిశ్వాసాలకు అనుమతివ్వొద్దంటూ తన ఆఫీసు నుంచి కమిషనర్లకు ఆదేశాలు ఇప్పించారు. కాగా, బిల్లు చట్టంగా మారకముందే ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడంతో మున్సిపల్ కమిషనర్లతో పాటు కలెక్టర్లలోనూ అయోమయం నెలకొంది.
రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్లు..
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగీర్, బడంగ్ పేట, మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, నిజాంపేట్, బోడుప్పల్, జవ హర్ నగర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు... వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, సిద్దిపేట జిల్లా చేర్యాల, సూర్యాపేట జిల్లా కోదాడ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జగిత్యాల, జనగామ తదితర మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు అసంతృప్త నేతలు పావులు కదుపుతున్నారు. కొన్ని బల్దియాల్లో ముందస్తు ఒప్పందాల ప్రకారం ప్రస్తుత మేయర్లు, చైర్పర్సన్లు గద్దె దిగి.. ఇతరులకు పదవి అప్పగించాల్సి ఉన్నా ససేమిరా అంటుండడంతో అసమ్మతి నేతలు నో కాన్ఫిడెన్స్ మోషన్పైనే ఆశలు పెట్టుకున్నారు. వీళ్లంతా కౌన్సిలర్లను వెంటేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. జగిత్యాల లాంటి కొన్నిచోట్ల మున్సిపల్ చైర్పర్సన్లతో పడని లోకల్ఎమ్మెల్యేలే అవిశ్వాస తీర్మానాల కోసం కౌన్సిలర్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అసమ్మతి ఎదుర్కొంటున్న చైర్పర్సన్ల పరిస్థితి దినదిన గండంగా మారింది. వారికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే రహస్య మీటింగులు, దావత్ లు జోరందుకున్నాయి. మున్సిపాలిటీని బట్టి అవిశ్వాసాన్ని బలపరిచేందుకు కౌన్సిలర్లు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తల పట్టుకుంటున్న అధికారులు..
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్న తరుణంలో కేటీఆర్ ఆఫీస్ నుంచి మున్సిపల్కమిషనర్లకు బుధవారం ఆదేశాలు అందాయి. ‘‘మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పొడిగిస్తూ చట్టాన్ని సవరించాం. ఈ బిల్లును అసెంబ్లీ, కౌన్సిల్ కూడా అమోదించాయి. న్యాయశాఖ అనుమతి కూడా పొంది, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది” అని మెసేజ్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానాలకు అనుమతి ఇవ్వొద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాస్తవానికి కమిషనర్ అండ్ డైరెక్టర్ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీఎండీఏ) నుంచి రావాల్సిన ఆదేశాలు.. మంత్రి కేటీఆర్ఆఫీసు నుంచి రావడంతో కమిషనర్లు అయోమయంలో పడ్డారు. ప్రస్తుత చట్టం ప్రకారం బల్దియాల్లో అవిశ్వాస తీర్మానం తీసుకొని, ఎన్నిక నిర్వహించే అధికారం ఆర్డీవోలకు ఉంటుంది. కొత్త చట్టంలో ఈ అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. కానీ తాజాగా అవిశ్వాస తీర్మానాలు అనుమతించవద్దంటూ మున్సిపల్కమిషనర్లకు ఆదేశాలివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆఫీస్నుంచి వచ్చిన ఆదేశాలపై క్లారిటీ కోసం కొందరు కమిషనర్లు పైఅధికారులు, కలెక్టర్లను సంప్రదించినా వాళ్లూ ఏమీ చెప్పలేకపోతున్నారు. నిజానికి బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంటే టెక్నికల్‌గా అది అమల్లోకి రానట్లే. ఈ లెక్కన ప్రస్తుత చట్టం ప్రకారం పాలకవర్గం గడువు మూడేండ్లు దాటితే అవిశ్వాస తీర్మానాన్ని కమిషనర్లు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వయంగా కేటీఆర్ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కౌన్సిలర్లు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోకపోతే లీగల్గాసమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఏం చేయాలో తెలియక కమిషనర్లు, కలెక్టర్లు తల పట్టుకుంటున్నారు.
- జనగామ మున్సిపల్ చైర్ పర్సన్‌కు అవిశ్వాస గండం
- భువనగిరిలో 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపు
జనగామ, వెలుగు: జనగామ మున్సిపల్చైర్పర్సన్పోకల జమునకు అవిశ్వాస గండం పొంచి ఉంది. పాలకవర్గం ఏర్పాటై గురువారానికి మూడేండ్లు అవుతుండడంతో అసమ్మతి వర్గం క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుధవారం భువనగిరిలో క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపుతున్నారు. ఏడాది కాలంగా జమున తీరుపై మెజారిటీ కౌన్సిలర్లు కోపంగా ఉన్నారు. నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దసరా టైమ్‌లో వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అసమ్మతి కౌన్సిలర్ల వెనుక చైర్ పర్సన్ పదవి ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్కౌన్సిలర్ బండ పద్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ నుంచి13 మంది, కాంగ్రెస్‌నుంచి10 మంది, బీజేపీ నుంచి నలుగురు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇండిపెండెంట్ల సాయంతో జమున చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం భువనగిరి క్యాంపులో ఉన్న కౌన్సిలర్ల టీమ్‌తో కాంగ్రెస్‌కు చెందిన కొందరు కౌన్సిలర్లు కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.