- వెలికితీత కోసం కొత్తగూడెంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ యూనిట్
- ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎఫ్టీడీసీతో సింగరేణి ఒప్పందం
- ఇది చారిత్రాత్మకం: సీఎండీ ఎన్. బలరామ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఓసీపీ మట్టి కుప్పల్లోంచి అరుదైన ఖనిజాలు వెలికి తీసే దిశగా కంపెనీ కీలక ముందడుగు వేసింది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు వెలికితీశాక పక్కన పారబోసే ఓవర్బర్జెన్(మట్టి) కుప్పలతో పాటు థర్మల్‌ప్లాంట్ల నుంచి వచ్చే బూడిదలో సిరియం, లాంథనం, నియో డిమియం, ప్రెసియో డిమియం, గాడోలినియం, డిస్రోజియం, లుటీషియం వంటి 14 రకాల రేర్ఎర్త్ఎలిమెంట్స్(ఆర్ఈఈ) ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన సింగరేణి, తాజాగా కొత్తగూడెం ఏరియాలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఈమేరకు ఎన్ఎఫ్టీడీసీ(నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్)తో ఒప్పందం చేసుకుంది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, ఎన్ఎఫ్టీడీసీ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. సింగరేణి ఓబీమట్టిని, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతున్న బూడిదను ఇప్పటికే ప్రయోగశాలల్లో పరిశీలించిన ఎక్స్పర్ట్స్ అందులో ఆర్ఈఈ ఉనికిని గుర్తించారు. తీరా ఇప్పుడు వాటిని కొత్తగూడెంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయబోయే ప్లాంట్‌కు తరలించి, ఎన్ఎఫ్టీడీసీ సాంకేతిక సాయంతో ఆర్ఈఈ ని వాణిజ్యపరంగా ఉత్పత్తిచేయనున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్ పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాలో సింగరేణికి చెందిన 1,200 మెగా వాట్ల థర్మల్ ప్లాంట్ నుంచి ప్రతిరోజూ వేల టన్నుల ఫ్లైయాష్ (బూడిద) వెలువడుతోంది. దీన్ని భువనేశ్వర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ) ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే ఆర్ఈఈలు ఉన్నట్లు తేలింది.
ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతం లోని ఓబీ మట్టిలో, రామగుండం ప్రాంతంలో సింగరేణికి ఉన్న ఓసీపీ గనుల నుంచి తవ్విన మట్టిలోనూ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని గుర్తించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న కీలక ఖనిజాల్లో ప్రధానంగా సీరియం, లాంథనం, నియో డిమియం, ప్రసియోడీమియం, గాడోలినియం, డిస్ప్రోసియం, లుటీషియం వంటి 14 రకాల అరుదైన మూలకాలు ఉన్నట్లు తేలింది.
మణుగూరు సమీపంలోని దుర్గం గుట్ట బ్లాక్‌లో సగటున 266.21 పీపీఎం స్థాయిలో ఆర్ఈఈ ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాంపిల్స్ ద్వారా ధ్రువీకరించింది. సింగరేణి ప్రాంతంలో లాంథనం, సీరియం, ప్రసియోడీమియం వంటి ఆరు లైట్ ఆర్ఈఈలు, ఇట్రియం, స్కాండియం, డిస్ప్రోసియం వంటి ఎనిమిది హెవీ ఆర్ఈఈలత ఉనికిని కనుగొన్నారు.
నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలతో చేయించిన రిసెర్చ్లోనూ రామగుండం రెండో ఓపెన్ కాస్ట్ మైన్లోని మట్టిలో వెనేడియం, స్ట్రాంటియం, జిర్కోనియం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం పరిధిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా పూర్తిస్థాయిలో పరిశోధన, విశ్లేషణ అనంతరం వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రక్రియ చేపట్టేందుకు ఐఎంఎంటీ సహకాంర అందించబోతోంది. కాగా, రేర్ఎర్త్ ఎలిమెంట్స్‌ను అణు రియాక్టర్లు, రాకెట్ సైన్స్, సిరామిక్ , ఐరన్ పరిశ్రమల్లో, వైద్య పరికరాలు, గ్లాస్, రంగుల తయారీలో వినియోగిస్తారు.. ఈ మూలకాలతో సింగరేని బిజినెస్ చేస్తే సంస్థ ఆదాయం పెరగడంతోపాటు దేశ ఖనిజ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుందని సింగరేణి భావిస్తోంది.
సింగరేణి భవన్లో కుదిరిన ఒప్పందం..
గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్. బలరామ్, ఎన్ఎఫ్డీసీ (నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) డైరెక్టర్ బాలసుబ్రమణ్యం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి ప్రాంతంలో లభ్యమవుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా కొత్తగూడెం ప్రాంతంలో ఒక ప్లాంట్ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
ఇందుకు సంబంధించి ఎన్ఎఫ్టీడీసీ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయని అభిప్రాయపడ్డ బలరామ్ ఖనిజాల వెలికితీత వల్ల వచ్చే లాభాలను అంచనా వేసి భవిష్యత్‌లో భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పీ అండ్ పీ) కె. వెంకటేశ్వర్లు, జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) టి.శ్రీనివాస్, జీఎం (బిజినెస్ డెవలప్మెంట్) రాందాస్, జీఎం (ఎక్స్ప్లోరేషన్) శ్రీనివాసరావు, ఎన్ఎఫ్టీడీసీ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
