
- గోదావరిఖనిలో చిరువ్యాపారుల కోసం రూ.5కోట్లతో మార్కెట్ నిర్మాణం
- చేపలు, మటన్, ఫిష్, కూరగాయలు ఒకేదగ్గర దొరికేలా ఏర్పాట్లు
- కమ్యూనిటీ హాల్, క్యాంటీన్ సౌకర్యం
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణంలోని విఠల్‌నగర్ మీ సేవా సెంటర్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పట్టణంలోని చిరువ్యాపారుల కోసం ఈ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019లో రూ.5కోట్లు మంజూరు కాగా.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులు.. ఇటీవల స్పీడందుకున్నాయి.
ఇప్పటికే 70శాతం పనులు జరగగా మరో రెండు మూడు నెలల్లో పూర్తకానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులు పూర్తయితే మార్కెట్‌లో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లతో పాటు పల్లె ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకువచ్చి అమ్మేలా ప్రత్యేకంగా రైతు బజార్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతోపాటు వ్యాపారుల కోసం క్యాంటీన్ సౌకర్యం, మీటింగ్‌లు, చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్‌ను కూడా నిర్మిస్తున్నారు.
3.12 ఎకరాల స్థల విస్తీర్ణంలో...
గోదావరిఖనిలో ప్రస్తుతం రాంనగర్, శివాజీనగర్ పరిసర ప్రాంతాల్లోనే మార్కెట్ఉంది. బల్దియా పరిధిలోని ప్రజలకు ఈ మార్కెటే ఆధారం. దీంతో బల్దియా ఆఫీసర్లు విఠల్‌నగర్, తిలక్‌నగర్, జవహర్‌నగర్, 7 ఎల్‌ఈపీ కాలనీ, ఫ్లైవింక్లయిన్ ఏరియా, తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా మీ సేవా సెంటర్‌కు సమీపంలో సింగరేణికి చెందిన 3.12 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.
ఈ స్థలంలో మార్కెట్ నిర్మాణానికి 2019లో రూ.5కోట్ల సీఎంఏ నిధులను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ఈ మార్కెట్ పనులు స్టార్ట్ కాగా.. ఆ తర్వాత వివిధ కారణాలతో మందకొడిగా సాగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యేగా రాజ్‌ఠాకూర్ ఎన్నికయ్యాక మార్కెట్ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పనులు స్పీడందుకున్నాయి.
హోల్‌సేల్, రిటైల్ బిజినెస్‌కు అనుకూలం
రాష్ట్రంలో లక్ష జనాభా దాటిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామగుండం కార్పొరేషన్‌లో 3లక్షల జనాభా ఉన్నా ఇప్పటిదాకా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేదు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి బల్దియా అధికారులు నిర్ణయించారు.
తొలుత విఠల్‌నగర్ మీ సేవా సెంటర్‌వద్ద మార్కెట్ పూర్తిచేసి ఆ తర్వాత మిగతా ఏరియాల్లో నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మార్కెట్‌లో హోల్‌సేల్, రిటైల్ కూరగాయలు అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా 16 నాన్వెజ్షాప్లు, 16 రిటైల్‌షాపులు, 16 రైతుబజార్షాపులు నిర్మించారు. అలాగే 28 హోల్సేల్షాపుల కోసం కేటాయించనున్నారు.