
- ఎల్లారెడ్డి నుంచి ఎక్కువ మంది ఆశావహులు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్‌కు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు 20 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి డీసీసీ ప్రెసిడెంట్ నియామకం కీలకం కానుంది. సమర్థవంతంగా పార్టీని నడిపించే లీడర్‌కు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ తరఫున ఆయా జిల్లాలకు అబ్జర్వర్లను నియమించారు.
కామారెడ్డి జిల్లాకు ఏఐసీసీ అబ్జర్వర్‌గా రాజ్‌పాల్ కరోల వచ్చారు. ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 13న జిల్లా కేంద్రంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. 14 నుంచి నియోజకవర్గాల వారీగా మీటింగ్ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 13న జిల్లా నేతలతో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 14న కామారెడ్డి నియోజకవర్గం, 15న ఎల్లారెడ్డి, 16న బాన్సువాడ, 17న జుక్కల్ నియోజకవర్గాల్లో మీటింగ్‌లు నిర్వహించి, అభిప్రాయాలు సేకరించారు.
నేడు అప్లయ్ చేసిన వారితో అబ్జర్వర్ భేటీ...
డీసీసీ ప్రెసిడెంట్పోస్టు కోసం అప్లయ్ చేసుకున్న వారితో శనివారం అబ్జర్వర్ భేటీ కానున్నారు. పార్టీ కోసం వారు చేసిన సేవలు తదితర అంశాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.
అప్లయ్ చేసుకున్న వారిలో..
నాలుగు నియోజకవర్గాల నుంచి డీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న కైలాస్ శ్రీనివాస్‌రావుతోపాటు నిమ్మ విజయకుమార్‌రెడ్డి, పంపరి శ్రీనివాస్, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, లింగాగౌడ్, గీరెడ్డి మహేందర్‌రెడ్డి, నారెడ్డి మోహన్‌రెడ్డి, షరీఫ్, రఫీక్, బాన్సువాడ నుంచి ఎం. రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరు, జుక్కల్ నుంచి మల్లికార్జున అప్పాతో పాటు మరో ముగ్గురు డీసీసీ ప్రెసిడెంట్కోసం అప్లయ్ చేసుకున్నారు.
ఏఐసీసీ కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రస్తుతం పదవి నిర్వహిస్తున్న వారికి ఇవ్వకూడదని పేర్కొన్నారు. దీంతో కైలాస్ శ్రీనివాస్‌రావు పేరుపై సందిగ్ధత నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈయన పేరును ఏకగ్రీవంగా ఇస్తున్నట్లు మీటింగ్‌లో ప్రకటించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా అబ్జర్వర్‌ను కలిసి పలువురు నాయకులు తమ అప్లికేషన్లను ఇచ్చారు.