జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ బోర్డ్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. కాలేజీలో ఇటీవల లెక్చరర్ల మధ్య తలెత్తిన సమస్యతో పాటు విద్యార్థుల పట్ల లెక్చరర్లు ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ రమణారావు బుధవారం విచారణ చేపట్టారు. విద్యార్థులతో, లెక్చరర్లతో విడివిడిగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ మేరకు తుది నివేదికను తయారుచేసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని రమణారావు పేర్కొన్నారు. విచారణలో డీఐఈవో గంగాధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
