ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
  • అటెండ్ కానున్న 4.16 లక్షల మంది స్టూడెంట్లు 
  • రాష్ట్ర వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలు 
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు  నాలుగు లక్షలకు పైగా స్టూడెంట్లు అటెండ్ కానున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని రకాలు చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇంటర్ సెకండియర్ సైన్స్ స్టూడెంట్లతో పాటు ఒకేషనల్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షలకు సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల కాలేజీలకు చెందిన మొత్తం 4,16,622 మంది అటెండ్ కానున్నారు. 

వీరిలో జనరల్ స్టూడెంట్లు 3,21,803 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 94,819 మంది ఉన్నారు. వీరందరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ సెషన్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్టర్​నూన్ సెషన్ లో ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీలకు పంపించామని, ప్రిన్సిపల్స్ నుంచి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

అరగంట ముందే క్వశ్చన్ పేపర్... 

ప్రాక్టికల్స్ క్వశ్చన్ పేపర్​ లీక్ కాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటున్నది. క్వశ్చన్ పేపర్లను ఆన్​లైన్​లో పెట్టి, ఎగ్జామినర్​కు వచ్చే పాస్ వర్డ్ ద్వారా మాత్రమే నిర్ణీత టైమ్​ కు అరగంట ముందు డౌన్​లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పేపర్ లీక్ కాకుండా ఉండే అవకాశముంది. దీంతో పాటు వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే వాల్యుయేషన్ చేసి.. ఆ వెంటనే ఆన్​లైన్​లో మార్కులు వేయనున్నారు. దీనివల్ల మార్కులు వేసే దాంట్లోనూ అక్రమాలను అరికట్టే అవకాశం ఉంది. 

పకడ్బందీ ఏర్పాట్లు చేశాం: జయప్రదబాయి, ఇంటర్ బోర్డు సీఓఈ

వచ్చేనెల 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్​కు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎగ్జామినర్స్​ను నియమించుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చాం. ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఆన్​లైన్​లో స్టూడెంట్ల మార్కులను అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. 

ప్రాక్టికల్స్ కు అటెండ్​ అయ్యే స్టూడెంట్ల వివరాలు..

  • ఎంపీసీ స్టూడెంట్లు    –   2,17,714
  • బైపీసీ స్టూడెంట్లు-    –   1,04,089
  • ఒకేషనల్ ఫస్టియర్    –   48,277 
  • ఒకేషనల్ సెకండియర్    –   46,542