ఇంటర్​లో మళ్లీ అఫిలియేషన్ల లొల్లి.. 400 ప్రైవేటు కాలేజీల గుర్తింపుపై అయోమయం

ఇంటర్​లో మళ్లీ అఫిలియేషన్ల లొల్లి.. 400 ప్రైవేటు కాలేజీల గుర్తింపుపై అయోమయం
  •     సెకండియర్ చదివే స్టూడెంట్ల చదువులపైనా ప్రభావం  
  •     గత సర్కారు ఇచ్చిన రెండేండ్ల స్పెషల్ పర్మిషన్ పూర్తి  
  •     మిక్స్​డ్ ఆక్యుపెన్సీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ఇంటర్  ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల లొల్లి మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్  కాలేజీల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. రెండేండ్ల స్పెషల్  పర్మిషన్ తో కొనసాగుతున్న 400  మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కాలేజీల అఫిలియేషన్లపై అయోమయం నెలకొంది. మరోపక్క ఆయా కాలేజీల్లో ఫస్టియర్  పూర్తయిన విద్యార్థుల పరిస్థితిపైనా సందిగ్ధం నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు జూనియర్  కాలేజీల అఫిలియేషన్  కోసం ఫిబ్రవరి 24న  ఇంటర్  బోర్డు నోటిఫికేషన్  విడుదల చేసింది.

మార్చి 31 వరకూ ఎలాంటి ఫైన్  లేకుండా కాలేజీల మేనేజ్మెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రూ.1000 ఫైన్ తో  ఈనెల 7 వరకు, రూ.5 వేల ఫైన్​తో ఈనెల 14 వరకు, రూ.10 వేల ఫైన్​తో ఈనెల 21 వరకు అఫిలియేషన్​ కోసం అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. మే 5 వరకు రూ.20 వేల జరిమానాతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 1,582 ప్రైవేటు జూనియర్  కాలేజీలు ఉండగా.. ఇప్పటి వరకూ1,300 కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దీంట్లో మిక్స్ డ్  ఆక్యుపెన్సీ కాలేజీలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంటర్  బోర్డు అధికారులు దరఖాస్తుల వెరిఫికేషన్  ప్రక్రియలో ఆయా కాలేజీల అప్లికేషన్లను పక్కన పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం మిక్స్​డ్  ఆక్యుపెన్సీ భవనాల్లోఉండే కాలేజీల్లో కార్పొరేట్  విద్యా సంస్థలూ ఎక్కువగానే ఉన్నాయి. వీటన్నింటి గుర్తింపుపై ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే, అకాడమిక్  చివర్లో పిల్లల భవిష్యత్తు కోసం ఇవ్వాలని సర్కారుకు మేనేజ్మెంట్లు చెప్పుకోవడం, దానికి ప్రభుత్వం అంగీకరించడం గత కొన్నేండ్లుగా పరిపాటిగా వస్తోంది. అదే ధీమాతో వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పలు ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, ఈసారి సర్కారు మారడంతో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే దానిపై స్పష్టత కరువైంది. 

ఫస్టియర్ పూర్తయినోళ్లకు ఇబ్బందే

ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల విజ్ఞప్తులతో గత బీఆర్ఎస్  సర్కారు మిక్స్​డ్  ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలకు 2022–23, 2023–24 అకాడమిక్  సంవత్సరాల్లో ప్రత్యేక అనుమతి ఇచ్చింది. రెండేండ్లలోపు నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాల్లో కాలేజీలు నిర్వహించాలని సూచించింది. ప్రస్తుతం ఆ గడువు 2023–24 విద్యా సంవత్సరంతో ముగిసింది.

మిక్స్​డ్  ఆక్యుపెన్సీ భవనాల్లో 2023–24 ఫస్టియర్​లో చేరిన స్టూడెండ్లు, పేరెంట్స్ నుంచి ముందుగానే అండర్ టేకింగ్ తీసుకోవాలని అప్పటి ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్  మిట్టల్  కాలేజీల మేనేజ్​మెంట్లకు సూచించారు. 2024–25 సంవత్సరంలో తాము చేరే కాలేజీకి గుర్తింపు ఉన్నా లేకున్నా.. ఇబ్బంది లేదని, తమ ఇష్టపూర్వకంగానే కాలేజీలో చేరుతున్నట్టు వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు సేకరించి పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆయా కాలేజీల్లో ఫస్టియర్ పూర్తి చేసిన స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది. గుర్తింపులేని కాలేజీల్లో సెకండియర్  ఎలా చదవాలనే దానిపై వారిలో అయోమయం నెలకొంది. ఆయా కాలేజీలపై ఇంటర్  బోర్డు అధికారులు ఎలా వ్యవహరిస్తారనే దానిపై సస్పెన్స్  కొనసాగుతోంది.