బుడ్డోడు చితకొట్టాడు.. 32 బాల్స్‌‌‌‌లోనే ఇండియా యంగ్ సెన్సేషన్ వైభవ్‌ రికార్డ్ సెంచరీ

బుడ్డోడు చితకొట్టాడు.. 32 బాల్స్‌‌‌‌లోనే ఇండియా యంగ్ సెన్సేషన్  వైభవ్‌ రికార్డ్ సెంచరీ

దోహా: ఇండియా యంగ్ సెన్సేషన్ 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బాల్స్‌‌‌‌లో సెంచరీ కొట్టి టీ20ల్లో ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌‌‌‌లో భాగంగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా–ఎ జట్టు తరఫున ఆడిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌ వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డుల మోత మోగించాడు.  తన విధ్వంసకర ఇన్నింగ్స్‌‌‌‌లో మొత్తం 42 బాల్స్‌‌‌‌ ఎదుర్కొని 144 రన్స్‌‌‌‌ చేశాడు.  

ఫస్ట్ బాల్‌‌‌‌కే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సూర్యవంశీ ఆ చాన్స్‌‌‌‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.  ఏకంగా 15 సిక్సర్లు, 11 ఫోర్లతో యూఈఏ బౌలింగ్‌‌‌‌ను ఉతికేశాడు. ఈ సునామీ ఇన్నింగ్స్‌‌‌‌తో 2018లో ఢిల్లీ తరఫున రిషబ్‌‌‌‌ పంత్ హిమాచల్ ప్రదేశ్‌‌‌‌పై (32 బాల్స్‌‌‌‌) నెలకొల్పిన సెకండ్ ఫాస్టెస్ సెంచరీ రికార్డును వైభవ్ సమం చేశాడు. 

ఇండియా తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అభిషేక్ శర్మ, ఉర్విల్ పటేల్ (28 బాల్స్‌‌‌‌) పేరిట ఉంది. ఇక, 14 ఏండ్ల 232 రోజుల వయసులో  సీనియర్ లెవెల్‌‌‌‌లో నేషనల్ టీమ్‌‌‌‌కు ఆడి సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గానూ  వైభవ్ వరల్డ్‌‌‌‌ రికార్డు సృష్టించాడు. 2005లో బంగ్లాదేశ్‌‌‌‌–ఎ తరఫున  ముష్ఫికర్ రహీమ్ 16 ఏండ్ల 171 రోజుల వయసులో కొట్టిన సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు.  

వైభవ్ మెరుపులకు తోడు కెప్టెన్ జితేష్ శర్మ (32 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో  83) కూడా రాణించడంతో ఇండియా–ఎ నిర్ణీత 20 ఓవర్లలో 297/4 స్కోరు చేసింది. టీ20 చరిత్రలోనే ఇది  ఐదో అత్యధిక స్కోరు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో యూఏఈ ఓవర్లన్నీ ఆడి 149/7 స్కోరుకే పరిమితం అవడంతో ఇండియా–ఎ 148 రన్స్ తేడాతో విజయం అందుకుంది. ఇండియా బౌలర్లలో గుర్జపనీత్ సింగ్ మూడు, హర్ష్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం సౌతాఫ్రికా–ఎతో ఇండియా–ఎ తలపడనుంది.