ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య .. స్కూల్‌‌ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య .. స్కూల్‌‌ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
  • సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల బాలికల కాలేజీలో ఘటన 
  • తమ కూతురిది సూసైడ్‌‌ కాదని, హత్య చేశారని పేరెంట్స్ అనుమానం 

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కాలేజీలో శనివారం రాత్రి ఇంటర్ స్టూడెంట్ దగ్గుబాటి వైష్ణవి (18) ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేటకు చెందిన వెంకన్న, భాగ్యమ్మల కూతురు వైష్ణవి గురుకుల కాలేజీలో ఇంటర్‌‌‌‌ సెకండియర్‌‌‌‌ చదువుతోంది. ఫేర్ వెల్ డే ఉందని చెప్పడంతో శనివారం ఉదయం వైష్ణవి పేరెంట్స్ వచ్చి పూలు, గాజులు ఆమెకు ఇచ్చి వెళ్లారు. సాయంత్రం కాలేజీ ఆవరణలో ఫంక్షన్​ జరుగుతుండగా వైష్ణవి హాస్టల్ రూమ్‌‌కు వెళ్లి.. ఫ్యాన్‌‌కి ఉరేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్లిన వేరే స్టూడెంట్స్ వైష్ణవిని చూసి కేకలు వేశారు. స్టూడెంట్స్, టీచర్స్ వెళ్లి బాలికను కిందికి దింపి, సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌‌కు తరలించగా, అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. అనంతరం హాస్టల్ సిబ్బంది వైష్ణవి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

ఆత్మహత్య కాదు హత్య..

తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని వైష్ణవి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఫేర్ వెల్ డేలో పాల్గొన్న వైష్ణవి సాయంత్రం వీడియో కాల్ చేసి నవ్వుతూ మాట్లాడిందన్నారు. కొన్ని రోజుల కింద వైష్ణవి ఇంటికి వచ్చినప్పుడు మున్సిపల్ చైర్ పర్సన్‌‌ను కలిసి.. హాస్టల్‌‌లో ఫుడ్ సరిగ్గా ఉండడం లేదని, అన్నంలో రాళ్లు వస్తున్నాయని చెప్పిందన్నారు. వెంటనే చైర్ పర్సన్ ప్రిన్సిపల్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడారని, అది మనసులో పెట్టుకొని తమ కూతురిని వేధించారని ఆరోపించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఆమెను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నట్టు కట్టుకథలు చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వార్డెన్ ఫోన్ చేసి వైష్ణవి ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్‌‌కు రావాలని చెప్పారన్నారు. తాము వచ్చేలోపే కాలేజీ సిబ్బంది వైష్ణవిని హాస్పిటల్‌‌లో వదిలేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రిన్సిపల్‌‌ను సస్పెండ్‌‌ చేయాలి..

వైష్ణవి మృతి పట్ల పేరెంట్స్, బంధువులు, విద్యార్థి సంఘాలు, కే‌‌వీ‌‌పీ‌‌ఎస్ నాయకులు గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. వైష్ణవి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్‌‌ను వెంటనే సస్పెండ్ చేసి, వైష్ణవి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షలు ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఎస్పీ నాగభూషణం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి: ఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌

‘‘భువనగిరి బాలికల మరణం మరువక ముందే సూర్యాపేటలో మరో స్టూడెంట్ చనిపోవడం బాధాకరం. విద్యార్థినులు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు ఆరు గ్యారంటీలు అవసరం లేదు. పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలి. విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సైకాలజిస్ట్‌‌లను నియమించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వైష్ణవి మృతిపై విచారణ చేసి, బాధ్యులను విధుల నుంచి తొలగించాలి. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి”అని బీఎస్పీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌ డిమాండ్‌‌ చేశారు. అనంతరం సూర్యాపేట హాస్పిటల్‌‌లో వైష్ణవి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. పాఠశాల వద్ద జరిగిన ఆందోళనలో కూడా ఆయన పాల్గొన్నారు.