వడ్డీరేట్లు మార్చలే!: బడ్జెట్‌‌ తర్వాతే నిర్ణయం

వడ్డీరేట్లు మార్చలే!: బడ్జెట్‌‌ తర్వాతే నిర్ణయం

ద్రవ్యోల్బణ భయాలూ కారణమే జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గింపు

ముంబైవడ్డీరేట్లపై ఆర్‌‌బీఐ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. వీటిని ఈసారి మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. మరో రెండు నెలల్లో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టడం, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత రేట్లనే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్‌‌బీఐ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు వడ్డీరేట్లను తగ్గించినా, ఆరోసారి మార్చడానికి మాత్రం ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) విముఖత చూపింది. ఇది వరకటి మాదిరిగానే రెపోరేటు 5.15 శాతం, రివర్స్‌‌ రెపోరేటు 4.90 శాతం కొనసాగుతాయి. సెప్టెంబరు క్వార్టర్‌‌లో జీడీపీ రేటు ఏకంగా 4.5 శాతానికి పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నందున ఈసారి సైతం రేట్లకు కోత పెడతారని బ్యాంకర్లు, ఎకనమిస్టులు అంచనా వేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిఅంచనాలను ఆరు శాతం నుంచి ఐదుశాతానికి తగ్గించింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టే ప్రస్తుతానికి రేట్ల తగ్గింపు జోలికి వెళ్లలేదని ఎంపీసీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది అక్టోబరు ద్రవ్యోల్బణం 4.6 శాతం నమోదైందని, తాము అంచనా వేసినదానికంటే ఇది ఎక్కువని తెలిపింది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో ద్రవ్యోల్బణం అంచనాలను 3.5–3.7 శాతం నుంచి 5.1–4.7 శాతానికి సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కనిపిస్తుండటం వల్ల జీడీపీ అంచనాలను తగ్గించినట్టు ఎంపీసీ తెలిపింది. ఉల్లి, టమాటా వంటి కూరగాయలు ధరలు చుక్కలనంటడంతో అక్టోబరులో ద్రవ్యోల్బణం అధికమయిన సంగతి తెలిసిందే.

ఆర్‌‌బీఐ నుంచి కొత్త ప్రీపెయిడ్‌‌ కార్డు

వస్తువుల, సేవల కొనుగోలు కోసం వాడుకోవడానికి కొత్తగా ప్రీపెయిడ్‌‌ పేమెంట్స్‌‌ ఇన్‌‌స్ట్రమెంట్‌‌ (పీపీఐ)ని అందుబాటులోకి తేవాలని ఆర్‌‌బీఐ ప్రతిపాదించింది. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌కు పీపీఐలు ఊతమిస్తున్నాయని, ఈ కొత్త పీపీఐ వల్ల అవి పెరుగుతాయని పేర్కొంది. బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే ఈ కార్డులో డబ్బులు వేసుకోవాలి. రూ.10 వేలకు మించి ఖర్చు చేయకూడదు. పీపీఐ జారీపై ఈ నెల 31లోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్‌‌బీఐ తెలిపింది. బ్యాంకులు, నాన్‌‌–బ్యాంకింగ్‌‌ కంపెనీలు ప్రిపెయిడ్‌‌ కార్డులను జారీ చేస్తాయి. వీటిలో రూ.50 వేల వరకు డబ్బును లోడ్‌‌ చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్‌‌కార్డు, బ్యాంకు అకౌంట్‌‌, క్రెడిట్‌‌కార్డులను వాడొచ్చు. వీటిలో మూడు రకాలు ఉంటాయి. క్లోజ్డ్‌‌ సిస్టమ్‌‌ పీపీఐ, సెమీ–క్లోజ్డ్‌‌ పీపీఐ, ఓపెన్‌‌ సిస్టమ్‌‌ పీపీఐ.

మార్కెట్లకు నష్టాలు

ఆర్‌‌బీఐ నిర్ణయంపై ఈక్విటీ మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించాయి. ఈసారి కూడా రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ఉదయం మార్కెట్‌‌ దాదాపు 100 పాయింట్ల వరకు పెరిగింది. ఆర్‌‌బీఐ నిర్ణయం ప్రకటించాక పరిస్థితి మారింది. బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ 70 పాయింట్లు నష్టపోయి 40,779 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 12,018 పాయింట్ల వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌‌లో  ఎయిర్‌‌టెల్‌‌, టాటా స్టీల్‌‌, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌, హీరో మోటోకార్ప్‌‌, టాటా మోటార్స్‌‌ 2.96 శాతం వరకు నష్టపోయాయి. ఆటో, బ్యాంకు, రియల్‌‌ ఎస్టేట్‌‌ సూచీలకూ నష్టం తప్పలేదు. టీసీఎస్‌‌, ఐటీసీ, ఎల్‌‌ అండ్‌‌ టీ, ఇన్ఫోసిస్‌‌, టెక్‌‌ మహీంద్రా, హెచ్‌‌డీఎఫ్‌‌సీ షేర్లు లాభాలతో ముగిశాయి.