కాంగ్రెస్ లో గ్రూపుల గోల!

కాంగ్రెస్ లో గ్రూపుల గోల!

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో జోరుగా గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.  సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్​ నియోజకవర్గాలలో లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న నేతలు గొడవలు పడుతున్నారు. 

సిద్దిపేటలో కోవర్టులు..! 

సిద్దిపేటలో కాంగ్రెస్​ నేతలు కొందరు కోవర్టులుగా మారారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఒక నేతపై క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు చేయడంతో షోకాజు నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడైన దర్పల్లి చంద్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు  పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొందరు స్థానిక నేతలు పీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సిద్దిపేటలో  కార్మిక సంఘ సమావేశానికి మంత్రి హరీశ్​రావును పిలిచి ఒకే వేదికను పంచుకున్నాడన్న ఆరోపణలతో పాటు, ఇతర జిల్లాల్లో అధికార పార్టీ నేతలతో తిరుగుతూ పార్టీని బలహీనపరుస్తున్నాడని కంప్లైంట్​ చేశారు.

స్థానిక పార్టీ క్యాడర్ లో పట్టు సాధించిన దర్పల్లి చంద్రంను బలహీన పర్చాలనే ఉద్దేశంతో  కొందరు ముఖ్య నేతల ప్రొద్బలంతో క్రమశిక్షణా కమిటీకి  ఫిర్యాదు చేసినట్టు ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండల పార్టీ అధ్యక్షులతో కలిసి  క్రమశిక్షణా కమిటీ షోకాజు నోటీసుకు సమాధానం ఇచ్చిన రోజే  చంద్రంను  సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీపీసీసీ సభ్యుడుగా నియమించడం గమనార్హం. ఈ పరిణామాలతో సామాన్య కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. 

దుబ్బాకలో చిలికి చిలికి గాలివానలా..!

దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్య నేతల అనుచరుల మధ్య తగదాలే చిలికి చిలికి గాలివానలా మారే పరిస్థితి కనిపిస్తోంది.  రెండేండ్ల కింద జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్​రెడ్డి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే  గతంలో మెదక్ నుంచి లోక్​సభకు పోటీ చేసిన శ్రవణ్​కుమార్ రెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం ఊపందుకుంది.  ఇటీవల శ్రవణ్​ కుమార్​ రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి  వర్గీయులు ఒకరిమీద మరొకరు విరుచుకుపడుతూ కామెంట్లు చేశారు. నియోజకవర్గం నుంచి  చెరుకు శ్రీనివాస్​రెడ్డిని ఇటీవలే టీపీసీసీ సభ్యుడిగా ఎంపిక చేయడం, అతడి వ్యతిరేక వర్గానికి ఇది మింగుడుపడటం లేదు. ఇలా మూడు నియోజకవర్గాలలో గ్రూపుల గోలతో కాంగ్రెస్​ కిందిస్థాయి కేడర్ ​అయోమయానికి గురవుతోంది.