త్వరలోనే మెగా స్టార్ లీగ్

త్వరలోనే మెగా స్టార్ లీగ్

ఐపీఎల్ క్రేజ్ తో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో టీ20 లీగ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్(BBL), పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL), శ్రీలంక ప్రీమియర్ లీగ్(SPL) అంటూ పొట్టి ఫార్మాట్ రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పడు మరో లీగ్ వస్తున్నట్లు తెలిపాడు పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది. మెగా స్టార్ లీగ్  ( MSL) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీ రాబోతుందని క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు.  ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. 

ఈ లీగ్‌లో పాకిస్థాన్‌ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, సినిమా, మ్యూజిక్ రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. పాకిస్థాన్‌లోని రావల్పిండి వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందన్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ పాల్గొంటాయని చెప్పాడు. 

పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్‌, బిగ్‌బాష్ లీగ్‌, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్‌ వేదికగా జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.