మహిళలు, బాలికలపై హింసను అరికట్టాలి

మహిళలు, బాలికలపై  హింసను అరికట్టాలి

‘మహిళలపై హింస అనేది పురాతనమైన అత్యంత విస్తృతమైన అన్యాయంలో ఒకటి.  అయినప్పటికీ హింస నివారణకు అతి తక్కువగా చర్యలు తీసుకుంటున్న సమాజం మనది’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. జనాభాలో సగం మంది  భయంతో జీవిస్తున్నప్పుడు  ఏ సమాజం కూడా  సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండలేదు.  ఈ  హింసను అరికట్టడం.. మనకు గౌరవం, సమానత్వం, మానవ హక్కులకు సంబంధించిన విషయం.  మహిళలకు, బాలికలకు సాధికారత కల్పించడం సమాజంలో శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి అవసరం.  ‘మహిళలకు సురక్షితమైన ప్రపంచం, అందరికీ మెరుగైన ప్రపంచం’ అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస విస్తృతంగా వ్యాపించి ఉంది.  ఇది అన్ని దేశాలు, ప్రాంతాల్లో మహిళలను ప్రభావితం చేస్తోంది.  ప్రతి ఏటా నవంబర్ 25న జరుపుకునే  ‘మహిళలు, బాలికలపై అంతర్జాతీయ హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలిపింది.  అంతేకాక 2030 నాటికి మహిళలు, బాలికలపై అన్ని రకాల హింసను తొలగించే  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొంది. 

లైంగిక హింస

ప్రపంచవ్యాప్తంగా15–-49 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో 8.4 శాతం మంది భాగస్వామికాని వ్యక్తి నుంచి లైంగిక హింసకు గురయ్యారు.  భారతదేశంలో15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో నాలుగు శాతం మంది భాగస్వామికాని వ్యక్తి నుంచి లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు.  భారతదేశంలో 15-–49 సంవత్సరాల వయస్సుగల మహిళల్లో ఐదోవంతు మంది 2023లో సన్నిహిత భాగస్వామిచే  హింసకు గురయ్యారు. దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ప్రభావితమయ్యారని ఓ నివేదిక పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముగ్గురిలో ఒకరు, లేదా 84 కోట్ల మంది వారి జీవితకాలంలో భాగస్వామి లేదా ఇతరుల నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నారు.  168 దేశాల్లో 2000 నుంచి 2023 మధ్య నిర్వహించిన సర్వేల నుంచి డేటాను సమీకరించిన నివేదిక ఇది.   మహిళలపై హింసను నిరోధించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తగ్గుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.  సమాజంలో అర్థవంతమైన మార్పులు తేవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని,  అందుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని నివేదిక ప్రపంచాన్ని కోరుతోంది. మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం అనేది ఐచ్ఛికం కాదు, శాంతి, అభివృద్ధి, ఆరోగ్యానికి అది ఒక అవసరం. 

ఆత్మహత్యలను నివారించాలి

మన దేశంలో 15-–29 సంవత్సరాల మధ్య వయసున్న యువత మరణాలకు ప్రధాన కారణం ఆత్మహత్యలే.  ఆత్మహత్యలను  నివారించాల్సిన వ్యవస్థలు సంక్షోభ పరిష్కారంపైనే దృష్టి సారిస్తున్నాయి తప్ప అసలు సమస్యను నివారించే  ప్రయత్నం చేయడం లేదు. యువత ఎక్కువగా చెబుతున్న సమస్యలేమిటంటే  ఒంటరితనం, నిస్సహాయత.  వీరి భయాలను, సమస్యలను పెద్దలు సరిగా అర్థం చేసుకోవడం లేదు. తమ బాధను ఎవరితో  చెప్పుకోవాలో తెలీక  కుమిలిపోతున్న యువత మనకు ఎక్కువగానే కన్పిస్తుంది.  ఇలాంటి  సందర్భాలలో కుటుంబం, సమాజం, సంస్థలు జోక్యం చేసుకోవాలి.  ఆత్మహత్యలను 
నివారించాలి.  యువతి లేదా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ప్రతి సందర్భం కేవలం విషాదం మాత్రమే కాదు. అలాంటి వారిని కాపాడలేకపోతున్న వ్యవస్థ వైఫల్యానికి అది ఒక సాక్షిగా  నిలుస్తోంది.  విద్యార్థుల ఆవేదనను వ్యక్తిగత కౌన్సెలింగ్‌‌ ద్వారా లేదా హెల్ప్‌‌ లైన్‌‌ ద్వారా తొలగించడాన్ని విస్తృతం చేయాలి.  సామాజిక, ఆర్థిక,  విద్యారంగాల్లో పురోగతి సాధించాలంటే.. జనాభాలో సగంగా ఉన్న  మహిళల పట్ల మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి.  ప్రభుత్వాలు వివిధ మాధ్యమాలలో ప్రకటనలు, ప్రచారం ద్వారా  ప్రజల్లో  అవగాహన పెంపొందించాలి. 

- కె. వేణుగోపాల్, 
విద్యారంగ విశ్లేషకుడు