దివ్యాంగ్ రోజ్గార్ సేతు ను వినియోగించుకోండి

దివ్యాంగ్ రోజ్గార్ సేతు ను వినియోగించుకోండి

ఇల్లెందు, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లెందు కోర్టు ఆవరణలో బుధవారం న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రికా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూసే ధోరణి పోవాలన్నారు. వారికి ప్రత్యేక చట్టాలు ఉంటాయని, చదువు, ఉద్యోగాల్లో సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. 

దివ్యాంగులు తమ సర్టిఫికెట్లను దివ్యాంగ్​రోజ్​గార్​సేతు యాప్​లో అప్​లోడ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ యాప్​పై అవగాహన లేనివారు మీసేవ కేంద్రానికి వెళ్లాలని సూచించారు.  అనంతరం దివ్యాంగులను శాలువాతో సత్కరించారు. ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంపెల్లి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో క్రీడాపోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సింగరేణి ఇల్లెందు ఏరియా ఆధ్వర్యంలో దివ్యాంగులకు బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జీఎం కృష్ణయ్య ప్రారంభించారు. అంగవైకల్యాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. డీజీఎం(పర్సనల్) అజ్మీర తుకారాం, సింగరేణి పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ తదితరులున్నారు. 

అన్ని రంగాల్లో రాణించాలి 

కామేపల్లి, వెలుగు: దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, తహసీల్దార్​సుధాకర్ సూచించారు. కొత్త లింగాల భవిత కేంద్రంలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఎంఈవో వెంకట్, ఐఈఆర్పీలు అనిత, శైలజ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు శివ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి  

ములకలపల్లి, వెలుగు: దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ భగవాన్ రెడ్డి సూచించారు. బుధవారం ములకలపల్లి ఎమ్మార్సీ లో దివ్యాంగ పిల్లలకు క్రీడాపోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. ఎంఈవో సత్య నారాయణ, ఆర్ఐ బద్రు నాయక్, మామిళ్లగూడెం పాఠశాల హెచ్ఎం శంకర్, ఐఈఆర్పీ రాజశ్రీ తదితరులున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో నిరుత్సాహ పడొద్దు

జూలూరుపాడు, వెలుగు: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో దివ్యాంగ విద్యార్థులకు రన్నింగ్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్ వంటి క్రీడాపోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహ పడకుండా వారి అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీవో అజయ్ సూచించారు. ఎంఈవో జుంకీలాల్, హెచ్​ఎం లక్ష్మీనర్సయ్య, టీచర్లు పాల్గొన్నారు.