మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం..కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

 మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం..కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

మా నవుడు సంఘజీవి.  తల్లి గర్భం నుంచి ఈ భూ ప్రపంచం మీదకు వచ్చిన తర్వాత మొదటగా తనకు పరిచయం అయ్యేది కుటుంబం అనే ఒక సామాజిక నిర్మాణమే.  మానవుడి సామాజిక మనుగడలో, అభివృద్దిలో కుటుంబ పాత్ర కీలకం.  ప్రాథమిక అవసరాలను తీరుస్తూ, సామాజిక బంధాలను, ప్రేమ, ఆప్యాయతలను మనిషికి పరిచయం చేసి, సంఘ జీవిగా నిలబెట్టేది కుటుంబ వ్యవస్థే.  అందుకే కుటుంబ వ్యవస్థ ఎంత బలీయంగా ఉంటే, సమాజం అంత బలీయంగా ఉంటుంది.

 కుటుంబ వ్యవస్థ మన చరిత్రకు సాక్ష్యం- మన భవిష్యత్​కు వారధిలాంటిది.  కుటుంబ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా వాటితో  పోలిస్తే భారతీయ కుటుంబ వ్యవస్థ కొంత ధృడమైనది. అందుకు కారణం భారతీయ సమాజంలోని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణించి విచ్ఛిన్న కుటుంబాలుగా ఏర్పడింది.  నేడు వాటి అస్తిత్వం కూడా ప్రమాదంలో పడ్డట్టు కనిపిస్తున్నది.  ‘ప్రపంచ శాంతిని పెంపొందించడానికి మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబాన్ని ప్రేమించండి’ అని  మదర్ థెరిస్సా అన్నారు.  సమాజంలో ఎటువంటి అలజడులు లేకుండా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం కావాలి అంటే ముందు కుటుంబ వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలి. 

కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం

ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కారల్ మార్క్స్ మానవ సంబంధాల గురించి ప్రస్తావిస్తూ  ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారు. ప్రస్తుతం భారతీయ సమాజ తీరుకు ఇది సరిగ్గా నప్పుతుంది. నేటి సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక అంశాల మీదనే ఆధారపడి ఉంటున్నాయి.  సామాజిక సంబంధాల మాట అటుంచి కనీసం ప్రాథమిక సంబంధాలకు కూడా పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ‘ఒక వ్యక్తి వ్యాపారం కోసం తన కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు’ అన్నారు వాల్ట్ డిస్నీ. 

కానీ నేటి సమాజంలో వ్యాపార లావాదేవీలతో,  ఆస్తి తగాదాలతో ఒకరికొకరు దూరమవడమే కాకుండా ఏకంగా రక్త సంబంధీకులను  చంపడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు.  ఏటా పెరుగుతున్న ఆస్తి గొడవలు, హత్యల్లో నిందితులుగా కుటుంబ సభ్యులే ఉండడం స్పష్టంగా గమనించవచ్చు. వయో వృద్దుల రక్షణ, సంక్షేమం కుటుంబాల ప్రాథమిక బాధ్యత.  కానీ, విచ్ఛిన్న కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా వరకు కుటుంబాలు ఆ బాధ్యతకు దూరం అయ్యాయి.  ప్రత్యామ్నాయ మార్గంగా వృద్ధాశ్రమాలను ఆశ్రయించడం పెరిగింది.   నేటి కుటుంబ వ్యవస్థ వైఫల్యానికి ఇదొక నిదర్శనం.  

కుటుంబాల్లో కొరవడిన ఆరోగ్యకర వాతావరణం వివాహం కుటుంబ వ్యవస్థకు పునాది వంటిది.  కానీ, నేడు అవలంబిస్తున్న వివాహ ధోరణులు కూడా కుటుంబ వ్యవస్థ బలహీనపడడానికి కారణం అవుతున్నాయి.  కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడం లేదు. ఇటీవల కాలంలో విడాకుల రేటు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. 

రోజురోజుకూ పెరుగుతున్న వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను  ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కొంతమంది సులభంగా వివాహ బాంధవ్యాలను తెంచుకుంటుంటే, మరికొందరు ఏకంగా కట్టుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు.  ఈ మధ్య కాలంలో ఒక అడుగు ముందుకు వేసి పేగు బంధాన్ని కూడా మరచి కన్న బిడ్డలను సైతం పాశవికంగా చంపుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అభం, శుభం తెలియని చిన్నారులు కన్న వారి కర్కశత్వానికి బలవుతూ ఉండడం సమాజాన్ని తీవ్రంగా కలచి వేస్తున్నది. 1993 నుంచే ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తూ ఉంటే, అందుకు క్షేత్ర స్థాయి నుంచి ఆశించినంత మద్దతు మాత్రం లభించడం లేదు అన్నది నిర్వివాదాంశం.

- డా. అనిల్ మేర్జ‌‌–