ఇంటర్నేషనల్‌‌ మీడియా ఏమన్నదంటే.. 

ఇంటర్నేషనల్‌‌ మీడియా ఏమన్నదంటే.. 

దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌ను అంతర్జా తీయ మీడియా కూడా కవర్‌‌ చేసింది. ఒక్కో సంస్థ ఒక్కోలా వార్తను రాసింది. ఎన్‌‌కౌంటర్‌‌పై ఇండియన్లు హర్షం వ్యక్తం చేశారని రాయిటర్స్‌‌, ఎన్‌‌కౌంటర్‌‌లో తేడాలున్నాయని అమెరి కన్‌‌ న్యూస్‌ వెబ్‌ సైట్‌‌ హఫ్‌ పోస్ట్‌‌, నిందితులను పోలీసులు చంపేశారని న్యూయార్క్‌‌ టైమ్స్‌‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌‌ కోసం చంపామన్న పోలీసుల కామెంట్‌‌తో దివైర్‌‌ వార్తలు రాస్తే.. ఎన్‌‌కౌంటర్‌‌ జరిగిన తీరును సీఎన్‌‌ఎన్‌‌, గార్డియన్‌‌ వివరించాయి.

చాలా మంది పొగిడారు

దిశ హత్య నిందితులను ఎన్‌‌కౌంటర్‌‌ చేశారని తెలిసిన తర్వాత చాలా మంది ఇండియన్లు పోలీసులను పొగుడుతూ పోస్టులు పెట్టారని రాయిటర్స్‌‌ రాసింది. దేశంలో ఏటా పెరుగుతున్న రేప్‌‌ కేసులు.. పోలీసులు, కోర్టులు చాలా మెల్లగా పని చేస్తుండటంతో ప్రజలు చాలాసార్లు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేశారని చెప్పింది. ‘ఇండియాలో రోజుకు 100 రేప్‌‌ కేసులు నమోదవుతున్నాయి. భయపడి కేసు పెట్టనివి ఇంకా చాలానే ఉన్నాయి. మరోవైపు కోర్టులను ఆ కేసులను ఏళ్లకు ఏళ్లు లాగుతున్నాయి’ అని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారని రాసింది.

పొద్దుపొద్దున్నే ఎన్‌‌కౌంటర్‌‌

దిశ హత్య నిందితులను పొద్దునపొద్దున్నే పోలీసులు చంపారని రాసిన హఫ్‌‌పోస్ట్‌‌.. ఎన్‌‌కౌంటర్‌‌కు సంబంధించి పూర్తి వివరాలు సరిగా తెలియలేదని పేర్కొంది. పోలీసులు, అధికారుల మాటలపై ఆధారపడి కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని చెబుతూనే వాటిల్లో చాలా తేడా ఉందని చెప్పింది. అధికారులు ఏం చెప్పారో కూడా రాసింది. 2008 నాటి వరంగల్‌‌ ఎన్‌‌కౌంటర్‌‌కు, ఇప్పటి ఎన్‌‌కౌంటర్‌‌కు పోలికలున్నాయంటూ సైబరాబాద్‌‌ కమిషనర్‌‌ వీసీ సజ్జనార్‌‌పై ఇంకో వార్త రాసింది.

రేప్‌‌ వార్తల్లో ఇండియా

దిశ హత్య కేసు సడన్‌‌గా, షాకింగ్‌‌గా ముగిసిపోయిందని న్యూయార్క్‌‌ టైమ్స్‌‌ పేర్కొంది. దిశ హత్య జరిగిన ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లి కాల్చి చంపారని రాసింది. నిందితులు తప్పించుకోవాలని చూశారని, అందుకే కాల్చాల్సి వచ్చిందని పోలీసులు చెప్పిన విషయాన్నీ పేర్కొంది. ఎన్‌‌కౌంటర్‌‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, హ్యూమన్‌‌ రైట్స్‌‌ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారని రాసింది. మరోవైపు భయంకరమైన రేప్‌‌ సంఘటనలతో ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్‌‌ మీడియా వార్తల్లో ఇండియా నిలుస్తోందని పేర్కొంది.

చట్టాన్ని చేతుల్లోకి..?

‘దిశ’ కేసు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగానే ఎన్‌‌కౌంటరయ్యారని సీఎన్‌‌ఎన్‌‌ రాసింది. ఇండియాలో రేప్‌‌ కేసు ఘటనల్లో బాధితురాలి పేరు బయటకు రానివ్వరు కాబట్టి తన గురించి పెద్దగా తెలియదని పేర్కొంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్న అనుమానాలొస్తున్నాయనీ రాసింది. పోలీసులే చంపేస్తే ఇక కోర్టులెందుకన్న బీజేపీ నేత మనేకా గాంధీ మాటలను కూడా రాసింది. అలాగే దేశంలో రోజుకు వంద రేప్‌‌ ఘటనలు జరుగుతున్నాయన్న నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో లెక్కలను చెప్పింది.

సెల్ఫ్‌‌ డిఫెన్స్‌‌ కోసం

‘దిశ’ కేసు నిందితులను ఎన్‌‌కౌంటర్‌‌ చేశారని ది వైర్‌‌ వార్త రాసింది. క్రైమ్‌‌ రీ కన్‌‌స్ట్రక్షన్‌‌ కోసం నిందితులను తీసుకెళ్తే తప్పించుకోవడం కోసం దాడికి ప్రయత్నించారని, సెల్ఫ్‌‌ డిఫెన్స్‌‌ కోసం కాల్చామని పోలీసులు చెప్పిన విషయాన్ని వివరించింది. పోలీసుల పనిని బాధితురాలి ఫ్యామిలీ, కొందరు నేతలు పొగిడారని రాసింది. ఎన్‌‌కౌంటర్‌‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న కోణాన్నీ పేర్కొంది.