అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : నర్సులకు గౌరవం పెరగాలి

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం :  నర్సులకు గౌరవం పెరగాలి

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో నర్సులు పాత్ర, ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.1953లో డోరోథీ సదర్లాండ్, యుఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ లో ఒక అధికారి, అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్హోవర్ ‘నర్సుల దినోత్సవం’ను ప్రకటించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల డే నిర్వహిస్తున్నారు.

1820 మే12న ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు, ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. యుద్ధ సమయంలో ఆమె శిక్షణ పొందిన నర్సుల మేనేజర్ గా పనిచేస్తూ గాయపడిన సైనికులకు సాయం చేసేది. అలా ఆరోగ్య సంరక్షణ సేవలు, నర్సింగ్ వృత్తిని సంస్కరించింది.1860 లో లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో ‘నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్’ను ప్రారంభించింది. నర్సులు, పర్యావరణం, పేదరికం తదితర అంశాలపై ఆధారపడి ఏటా ఒక థీమ్ ను ఎంపిక చేసి నర్సుల డే నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా తదితర దేశాల్లో వారం రోజుల పాటు వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది 2023లో “మన నర్సులు- మన భవిష్యత్తు” అనే థీమ్ తో నర్సుల డే నిర్వహించుకుంటున్నాం. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం

నర్సుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వచ్చే రెండేళ్లలో దేశంలో 157 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్​సుఖ్ మాండవీయ స్వయంగా ఆ విషయం ప్రకటించడం హర్షణీయం. భారతదేశంలో ప్రస్తుతం 5,324 నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. రాబోయే 24 నెలల్లో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఈ జాబితాలో చేరతాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.1,570 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారత ప్రభుత్వం ప్రతి వైద్య కళాశాలలో, కొత్త నర్సింగ్ కళాశాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నర్సింగ్ కళాశాలల స్థాపన ద్వారా దాదాపు 16,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

దీంతో దేశంలో వైద్య విద్య విస్తరణ జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది కొత్త వైద్య కళాశాలల కోసం అదనంగా1,827 స్టాఫ్ నర్సులను కూడా నియమించనుంది. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్స్​ మొదలవుతాయి. ఒక్కో మెడికల్ కాలేజీకి 203 స్టాఫ్ నర్సులను కేటాయించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2022లో 5,204 స్టాఫ్ నర్సుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సమాజ సేవే లక్ష్యంగా పని చేస్తున్న నర్సుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు మంజూరు చేసి వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నర్సులకు మంచి సౌకర్యాలు కల్పించాలి. ప్రొఫెషనల్ కోర్సులను కాదని సేవ దృక్పథంతో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న నర్సింగ్ విద్యార్ధులను ప్రోత్సహించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేయాలి. హాస్పిటల్ లో చికిత్స పొందే రోగులను మన కుటుంబంలో ఒక మనిషిగా ఆరోగ్య సేవలు అందించే నర్సులను మనం  ఎల్లప్పుడూ గౌరవిద్దాం. 

కరోనా సమయంలో కీలక పాత్ర

నర్సింగ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వృత్తిగా, మిలీనియం డెవలప్​మెంట్ గోల్స్ ను సాధించే ఒక పవిత్రమైన సేవా గుణం గల వృత్తిగా గుర్తింపు దక్కుతున్నది. భౌతిక, మానసిక, సామాజిక తదితర అన్ని అంశాల ద్వారా రోగుల ఆరోగ్యం, సంరక్షణ కోసం నర్సులు శిక్షణ పొందుతారు. రోగి అవసరాలను అంచనా వేయడం, సంరక్షణ ప్రణాళికను రూపొందించడం, మందులు అందించడం, ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించడం, రోగులు వారి కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించడం వంటివి వారి ప్రధాన బాధ్యతలు. ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే నర్సులకు లోతైన ఆచరణాత్మక జ్ఞానం ఉంటుంది. నర్సులకు సమాచారం, సలహాలు అందించడం, వారిని ప్రోత్సహించటం, మెరుగైన సేవలు అందించటానికి మద్దతు ఇవ్వడంలో జాతీయ నర్సుల సంఘాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

జాతీయ నర్సుల సంఘాలు ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. నర్సుల ఇంటర్నేషనల్  కౌన్సిల్ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల పట్ల నర్సింగ్ వృత్తి, సహకారం గురించి ప్రజా అవగాహన పెంచడానికి అంతర్జాతీయ మండలి ఒకటి ఉన్నది. రోగి విషయంలో ప్రతి క్లిష్టమైన పనులను చక్కటి మార్గంలో పరిష్కరించే నర్సులకు సమాజంలో ఇంకా గౌరవం పెరగాలి. కరోనా సమయంలో రోగులకు చికిత్స చేయడంలో నర్సులు కీలక పాత్ర పోషించారు. నర్సులే ఐసోలేషన్ విధానాలను అమలు చేయడం, రోగులకు సంరక్షణ అందించడం, కుటుంబాలతో కమ్యూనికేట్ చేయడం, కరోనా వైరస్ నివారణపై ఆరోగ్య విద్యను అందించడం, రోగి పరిస్థితిని సమీక్షించడం లాంటి విధులను నిర్వహించి లక్షల మందిని కరోనా బారి నుంచి కాపాడారు.

- డా. కందగట్ల  శ్రవణ్ కుమార్