అంతర్జాతీయ టీ దినం... చరిత్ర, ప్రాముఖ్యత

అంతర్జాతీయ టీ దినం... చరిత్ర, ప్రాముఖ్యత

ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే టీకి International Tea Day ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత ఉంది. తలనొప్పికి, రీఫ్రెష్ అవడానికి, టైంపాస్ కి.. ఇలా సమయం, సందర్భంతో తేడా లేకుండా చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది టీ. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే లాంటి రోజులున్నట్లే టీకి కూడా ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. ప్రతి సంవత్సరం మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం International Tea Day జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.

టీ దినోత్సవం చరిత్ర

ఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల సంవత్సరాల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్ లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.

టీ దినోత్సవం ప్రాముఖ్యత

అంతర్జాతీయ టీ దినోత్సవం (International Tea Day) అనేది కార్మికులు, పెంపకం దారుల తేయాకు వ్యాపారంపై ప్రభావం లాంటి అంశాలను వివరిస్తుంది. టీ ఉత్పత్తి, ప్రాసెసింగ్ తీవ్రమైన పేదరికాన్ని తగ్గించడానికి, మహిళల సాధికారతకు దోహద చేస్తాయి. ఈ రోజున గ్రామీణాభివృద్ధిపై, స్థిరమైన జీవనోపాధిపై టీ ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.