రాజకీయ జోక్యం వల్లే సింగరేణిలో అవినీతి : జనక్ ప్రసాద్

రాజకీయ జోక్యం వల్లే సింగరేణిలో అవినీతి :  జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన చరిత్ర గని కార్మికులదని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గని, ఏరియా వర్క్ షాప్ లో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.

సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అవినీతి పెరిగిపోయిందని, మాజీ సీఎం కేసీఆర్ జేబు సంస్థగా సింగరేణిని వాడుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.30 వేల కోట్ల బొగ్గు, విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్నారు.

సంస్థకు అవసరమయ్యే టూల్స్ కోనుగోలుకు ప్రతి ఏడాది రూ.10వేల కోట్ల లావాదేవీలు ఉంటాయని అందులో కూడా అక్రమాలు జరిగాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అండదండలతో అవినీతికి పాల్పడిన టీబీజీకేఎస్, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు. కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం, సొంతింటి నిర్మాణానికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.25 లక్షల వడ్డీ లేని రుణం, పెర్క్స్ పై ఇన్​కమ్​టాక్స్ మాఫీ, అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగుల సమస్యలు,  హక్కుల పరిరక్షణకు ఐఎన్టీయూసీ కట్టుబడి ఉందన్నారు.

యాజమాన్య తొత్తు సంఘాల మాయ మాటలకు కార్మికులు మోసపోవద్దని సూచించారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటేసి ఐఎన్టీయుసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు యూనియన్ లో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లు శంకర్ రావు, భీం రావు, కళవేణ శ్యామ్, తిరుపతి రాజు, గరిగె స్వామి,  తిరుపతి రెడ్డి, సమ్ము రాజయ్య, రాఘవ రెడ్డి, జైపాల్ రెడ్డి, శీలం చిన్నయ తదితరులు పాల్గొన్నారు.